● 10 అడుగుల మేర పడిన గండి
● స్పష్టమైన అధికారుల నిర్లక్ష్యం
● వృధాగా పోయిన సాగునీరు
అక్కివలస సమీపంలో
వంశధార ఎడమ కాలువకు పడిన భారీ గండి
సారవకోట: మండలంలోని గుమ్మపాడు పంచాయతీ అక్కివలస సమీపంలో సోమవారం అర్ధరాత్రి వంశధార ఎడమ కాలువకు 10 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో గండి పడింది. మంగళవారం ఉదయం 5 గంటలు దాటిన తర్వా త స్థానిక రైతులు గండిని గమనించి వంశధాన అధికారులకు సమాచారం అందజేశారు. రాత్రే గండి పడడంతో సాగునీరు చాలావరకు వృధాగా పోయింది. ఉదయం వంశధార అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గొట్టా బ్యారేజ్ దగ్గర నీటి విడుదలను నిలుపుదల చేశారు. అనంతరం మధ్యాహ్నం వరకు నీటి ప్రవాహం ఉద్ధృతంగా వస్తుండటంతో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ నెల 6న వంశధార ఎడమ కాలువలో నీటిని విడుదల చేశారు. అనంతరం సంబంధిత అధికారులు కాలు వ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ గట్లు బలహీనంగా ఉన్నాయి అన్నవి గమనించలేదు.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో ఉన్న నీటిని ఎంతో పొదుపుగా వినియోగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంతో గండి పడి ఎంతో విలువైన నీరు వృధాగా పోయింది. రబీ పంట కు చివరి దశలో నీరు కావాలని మొరపెట్టుకున్నా నీరు విడిచి పెట్టలేదని, కానీ సోమవారం రాత్రి కాలువకు పడిన గండితో ఎంతో నీరు వృధా అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి ఆగ్రహం
వంశధార కాలువకు గండి పడడంపై జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే గండి పూడ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వృధాగా పోతున్న నీరు
బతిమలాడాం..
రబీలో చివరి తడి కోసం నీరివ్వాలని ఎంత బతిమలాడినా అధికారులు నీరివ్వలేదు. ఇప్పు డు గట్లు పరిశీలించకుండా నీటి వృధాకు కారణమయ్యారు. – మెండ సూర్యనారాయణ, రైతు, బద్రి గ్రామం, సారవకోట మండలం
గండి పూడ్చుతాం
అక్కివలస సమీపంలో వంశధార ఎడమ కాలువకు పడిన గండిని పూడ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం వచ్చిన వెంటనే నీటి విడుదలను నిలుపుదల చేసి గండి పడిన చోట ఇసుక బస్తాలు వేశాం. బుధవారం నాటికి మళ్లీ నీటిని విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– మురళీ మోహన్,
వంశధార నీటి పారుదల శాఖ ఈఈ


