గ్రంథాలయం.. దయనీయం..! | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయం.. దయనీయం..!

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

ఆందోళన తప్పదు సమస్యల పరిష్కారానికి కృషి

ఇబ్బందులు పడుతున్నాం

దారుణం

శ్రీకాకుళం అర్బన్‌: గత నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో జిల్లాలోని గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వం గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన గ్రాంట్‌ సక్రమంగా విడుదల చేయకపోవడం వలన నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు, 10 నెలలుగా పత్రికల బిల్లులు, కరెంట్‌ బిల్లులు, స్వీపర్‌ ఛార్జీలు కూడా చెల్లించక ఇబ్బందులు తప్పడం లేదు. ఒక నెలకు గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, పేపర్‌ బిల్లులకు రూ.45 లక్షలు అవసరమవ్వగా.. ఆ నిధులను విడుదల చేయడం లేదు. జిల్లాలో 20 మంది శాశ్వత ఉద్యోగులు, 60 మంది పెన్షనర్లు, 13 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. వీరికి ఏడాదికి చెల్లించేందుకు కనీసం రూ.6 కోట్లు కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ కేవలం రూ.2.22 కోట్లు మాత్రమే గ్రాంటు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అదనపు గ్రాంటు కోసం ప్రభుత్వాన్ని కోరగా ఇవ్వడం కుదరదని ఫైలు తిప్పి పంపించి వేసింది. దీంతో సక్రమంగా జీతాలు, పింఛన్లు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

నిర్వహణకు గడ్డు పరిస్థితి

ప్రభుత్వం సకాలంలో నిధులు చెల్లించకపోవడం వలన గ్రంథాలయాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రంథాలయాల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు వసూలైన సెస్సుతో అభివృద్ధి జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో గ్రంథాలయాలకు, పుస్తకాల కొనుగోళ్లకు, రోజువారీ వచ్చే దిన, వార, మాస పత్రికలకు సొమ్ములు చెల్లించడం లేదు. ఇలా అయితే గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ప్రభుత్వం గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించని పక్షంలో దశలవారీగా ఆందోళన చేపడతాం. అలాగే వేసవి శిక్షణా శిబిరాలను కూడా బహిష్కరిస్తాం.

– పి.ఉగ్రసేన, జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి

జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాం. ఇటీవలే మంత్రి నారా లోకేష్‌కు సమస్యను వివరించాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్‌ నిధుల కోసం కృషి చేస్తున్నాం. ఇటీవల వసూలైన సెస్సు నుంచి రెగ్యులర్‌ ఉద్యోగులకు డిసెంబర్‌ నెల జీతం ఇవ్వడం జరిగింది. మరికొంత వసూలైన సెస్‌లో పెన్షనర్లకు ఒక నెల పెన్షన్‌ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. అయితే మార్చినెలాఖరు కావడంతో ఆగింది. త్వరలోనే పెన్షనర్లకు ఒక నెల పెన్షన్‌ చెల్లిస్తాం. జిల్లాలో కూడా ఇళ్లు, పంచాయతీల నుంచి రావాల్సిన నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.

– పీరుకట్ల విఠల్‌,

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌

ములిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా ఈనెల 26వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించాల్సి ఉంది. అయితే గ్రంథాలయ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతుంటే వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ, వాటి ఖర్చు ఉద్యోగులే భరించాలని అనడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించినా వాటికి సంబంధించి ఎటువంటి బిల్లులూ చెల్లించలేదని, ఆ నిర్వహణ ఖర్చుల భారం గ్రంథాలయ ఉద్యోగులే భరించాల్సి వచ్చిందని వాపోతున్నారు.

గత నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యలపై జేసీ, మున్సిపల్‌ అధికారులను కలిశాం. శ్రీకాకుళం మున్సిపాలిటీ కట్టాల్సిన సెస్‌ను త్వరలోనే కట్టించే ఏర్పాట్లు చేస్తామని జేసీ చెప్పడం జరిగింది. సెస్‌ వసూలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మా జీతాలను ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదని, స్థానిక సంస్థల నుంచే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం శోచనీయం.

– వీవీజీ శంకరరావు,

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి

గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. గత 33 ఏళ్ల చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. 40 శాతం నిధులు ప్రభుత్వం విడుదల చేసి.. 60 శాతం ఇళ్లు, పంచాయతీల నుంచి వసూలైన సెస్‌ నుంచి జీతాలు, పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పడం సరికాదు. నాలుగు నెలలుగా పెన్షన్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మందులకు, నెలవారీ ఖర్చులకు కూడా అవస్థలు పడుతున్నాం.

– టి.వైకుంఠరావు, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ

గ్రాంట్‌ సక్రమంగా విడుదల చేయని ప్రభుత్వం

నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లకు ఉద్యోగుల ఎదురుచూపులు

పత్రికల బిల్లులూ చెల్లించలేని వైనం

ప్రశ్నార్థకంగా వేసవి శిక్షణా శిబిరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement