● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
● తాజా, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు సత్కారం
పలాస: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. ఇప్పటినుంచే గ్రామాల్లో తగిన వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ తాజా, మాజీ కౌన్సిలర్లు, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన మాజీ సర్పంచ్‌లను శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయం ఆవరణలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీలోని కౌన్సిలర్ల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. గెలిచే అభ్యర్థికే అవకాశాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. 2027లో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఉంటుందని, ఆ సమయంలో మనం కూడా స్థానికంగా అందుకు అనుగుణమైన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజయరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నాయకులంతా కష్టపడి పనిచేసి పార్టీని గెలుపించుకోవడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడ దుర్యోధనరావు, పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకటరావు, పలాస ఏఎంసీ మాజీ చైర్మన్ పి.వి.సతీష్, వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం నాయకుడు మొదలవలస మన్మథరావు, పలాస–కాశీబుగ్గ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిస్టు గోపి, పైల వెంకటరావు, ఉంగ సాయికృష్ణ, డల్లి జానకిరెడ్డి, దువ్వాడ రవి, తిర్రి రాజారావు, బత్తిన హేమేశ్వరరావు, బోర చంద్రకళ, సుజాత పండా, మీసాల సురేష్‌బాబు, బెల్లాల శ్రీనివాసరావు, మందస మాజీ ఎంపీపీ డొక్కర దానయ్య, ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్, మచ్చ రత్నాలు, సవర చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.


