● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాసలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలిసి పలాస ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 50 మంది రైతులకు ఒక్కొక్క వీఆర్వో చొప్పున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీఆర్వోలు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి రెవెన్యూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామసభలు ఏర్పాటు చేసినపుడు తహసీల్దార్లు, పోలీసులకు పలు సూచనలు జారీ చేశారు. వీఆర్వోల వద్ద వారికి కేటాయించిన వారి వివరాలు ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, పలాస ఆర్డీవో ఆర్.అప్పలరాజు, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.


