అచ్చెన్నాయుడూ.. నోరు అదుపులో పెట్టుకో..! | - | Sakshi
Sakshi News home page

అచ్చెన్నాయుడూ.. నోరు అదుపులో పెట్టుకో..!

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

ఎర్రన్నాయుడి

మరణంలో నీ హస్తం లేదని చెప్పగలవా?

ఆ రోజు

ఏం జరిగిందో

అందరికీ తెలుసు

విలేకరుల సమావేశంలో మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఆమదాలవలస: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణంపై అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆమదాలవలసలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసం చనిపోయిన వ్యక్తిపై బురద చల్లడం అచ్చెన్నాయుడి దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. వైఎస్సార్‌ మరణించిన సమయంలో జగన్‌మోహన్‌ రెడ్డి విదేశాల్లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, ఆనాడు తండ్రి మరణవార్త విని కుప్పకూలిపోయిన కుటుంబానికి జగన్‌ అండగా ఉండి, అంత్యక్రియల వరకు అన్ని తానై చూసుకున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని గుర్తుచేశారు. మంత్రి రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ఆడటం తగదన్నారు. సింగుపురం వద్ద ఎర్రనాయుడిపై జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ ఘటనలో అచ్చెన్నాయుడి హస్తం లేదని చెప్పగలవా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రణస్థలం మండలం వద్ద ఎర్రన్నాయుడు వాహన ప్రమాదంలో మృతి చెందిన ఘటనలో నీ హస్తం లేదని చెప్పగలవా..! అంటూ నిలదీశారు. వైఎస్సార్‌ తన పాదయాత్ర ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు అనేక మంది జీవితాలను మార్చాయని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడిపై విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడమేనని అన్నారు. రాష్ట్రంలో ‘మావిగన్‌’ ప్లాన్‌–బికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని, అమరావతిలో జరుగుతున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఆదేశాలతో అచ్చెన్నాయుడు ఇటువంటి నీచమైన డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. ‘అమరావతి వద్దు.. మావిగన్‌ ముద్దు’ అని ప్రజలు అంటున్నారని చెప్పారు. వైఎస్సార్‌ పాదయాత్ర చేసి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించిన సేవలు గుర్తుచేశారు. మహానేత అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంటి వ్యక్తులపై నోరుజారడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, బూర్జ జెడ్పీటీసీ బెజ్జపురం రామారావు, బూర్జ నాయకులు కర్నేని నాగేశ్వరరావు, ఆమదాలవలస మాజీ జెడ్పీటీసీ బొడ్డేపల్లి నారాయణరావు, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ జనరల్‌ సెక్రటరీ బెండి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement