● కంబాలరాయుడుపేటలో చక్రం
తిప్పుతున్న టీడీపీ నేత
● కోల్‌కతా, ఖరగ్‌పూర్, బిలాయి వంటి దూరప్రాంతాలకు వెళ్లి వసూళ్లు
వజ్రపుకొత్తూరు: మత్స్యకార పంచాయతీ కంబాలరాయుడుపేటలో వలస పింఛన్‌దారులకు టీడీపీ సీనియర్ నాయకుడు గాలం వేస్తున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోల్‌కతా, ఖరగ్‌పూర్, బిలాయిలో వలస ఉన్న దాదాపు 60 మంది పింఛన్‌దారుల స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్లి సేవలందిస్తున్నామనే ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం స్థానిక గ్రామ సంఘాల్లో ఇది చర్చనీయాంశమైంది. సదరు టీడీపీ నేత గ్రామంలో తగాదాలు సైతం సృష్టించి సంఘాల విచ్ఛిన్నానికి పూనుకుంటున్నట్లు గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం వలస పింఛన్‌దారులకు మూడు నెలల వరకు పింఛన్ తీసుకునేందుకు గడువు ఇచ్చింది. కానీ టీడీపీ నేత మాత్రం లబ్ధిదారుల వద్దకు ప్రతి నెలా వెళ్లి నియోజకవర్గ టీడీపీ కీలక నేత ఆదేశాలతో మీ వద్దకే పింఛను తెస్తున్నానని నమ్మబలికి, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చూస్తున్నాడని, అంతేకాకుండా సచివాలయ సిబ్బంది ఖర్చులంటూ వసూళ్లు కూడా చేస్తున్నట్లు గ్రామస్తులు ఇటీవల ఎంపీడీఓ ఎన్.రమేష్ నాయుడుకి ఫిర్యాదు చేశారు. దానిపై నేటి వరకు ఎలాంటి విచారణ జరగలేదని ఫిర్యాదుదారులు లండ రుద్రమూర్తి, డి.విఘ్నేష్, ఎల్.చైతన్య, ఎల్.గురుమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ఆధారాలతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రతి నెలా ఓ ప్రాంతానికి(ఇతర రాష్ట్రాలకు) పింఛన్ల పంపిణీ కోసం వెళ్లిన సచివాలయ సిబ్బంది హాజరు రికార్డుల్లో మాత్రం సంతకాలు చేస్తుండం గమనార్హం. ఈ విషయమై ఎంపీడీఓ ఎన్.రమేష్ నాయుడును వివరణ కోరగా గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందిందని, వారికి ఆధారాలు అందించాలని కోరామని, పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


