పీజీఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలన్నింటినీ పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయదేవితో కలిసి 145 అర్జీలు స్వీకరించారు. అయితే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నాతాధికారులు హాజరుకాకపోవడంతో వినతిదారులు నిరాశ చెందారు.
వినతుల్లో కొన్ని..
● ఎటువంటి అవకతవకలు జరగకపోయినా ఎంక్వయిరీ పేరిట వచ్చి నోటీసులు ఇచ్చారని అరసవిల్లి చౌక ధరల దుకాణం మహిళా రేషన్ డీలర్ కొండ్రి విజయలక్ష్మి వాపోయారు. రాజకీయ కక్షతో తనను తొలగించేందుకు చూస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. ● శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ పరిధిలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పనివేళల మార్పు సరికాదని శ్రీకాకుళం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు.
● గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో వక్ఫ్ భూములపై ఇచ్చిన నోటిపికేషన్ నిలుపుదల చేయాల జిల్లా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు కోరారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు బేగ్, మహ్మద్ రఫీ, అమీర్ పాల్గొన్నారు.
● శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు సాధారణ భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని వంశపారంపర్య అర్చకుడు ఎన్.రాజశేఖరం కోరారు.
● ఆమదాలవలస మండలం చింతలపేట పంచాయతీ దండింవలసలో కాలువను కప్పి రోడ్డు వేయడంతో సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని పరిసర ప్రాంత రైతులు విన్నవించారు.
పీజీఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ


