ఎదురుచూపులు ఎన్నాళ్లు?
ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. బీసీ, ఎస్సీలకు మొండిచేయి చూపించింది. కూటమి నాయకులకు పాలనలోనే పలు కార్పొరేషన్లకు సంబంధించి ఇంటర్వ్యూలు జరిగాయి. వారు సిఫార్సు చేసిన వారికే రుణాలు ఇవ్వాలని అప్పట్లో బ్యాంకర్లకు హుకుం జారీ చేశారు. రుణాలకు సంబంధించిన సబ్సిడీ నిధులు ఎందుకు జమ కాలేదన్న సంగతి కూటమి నాయకులకే తెలియాలి.
– నర్తు రామారావు, ఎమ్మెల్సీ
మండలానికి బీసీ కార్పొరేషన్ కింద 70, ఎస్సీ కార్పొరేషన్ కింద 3, కాపు కార్పోరేషన్ కింద 2 యూనిట్లు మంజూరయ్యాయి. అయితే మండలాలలో నిరుద్యోగులకు ఇచ్చిన యూనిట్లు చాలవని పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అదనపు యూనిట్ల కేటాయింపులు చేయాలనే ఆలోచనలో ప్రక్రియ నడుస్తోంది. ప్రస్తుతం జరిగిన కేటాయింపుల మేరకు మండలాల్లో బ్యాంకర్లతో ఇంటర్వ్యూలు చేసి జాబితా ఉన్నతాధికారులకు నివేదించాం.
– కె.శ్రీనివాసరెడ్డి,
ఇన్‌చార్జి ఎంపీడీఓ, కవిటి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించాం. ఇంటర్వ్యూలు పూర్తి చేశాం. లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉంది.
– ఆర్.కాళీప్రసాద్,
ఎంపీడీఓ, హిరమండలం
హిరమండలం/కవిటి:
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించేందుకు ఏడాది కిందట దరఖాస్తుల స్వీకరించింది. ఇంటర్వ్యూలు సైతం పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడాది అవుతున్నా ఇంతవరకూ రుణాలు ఇవ్వలేదు. దీంతో నిరుద్యోగ యువత ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 30 మండలాలతో పాటు శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాల్టీల పరిధిలో వెనుకబడిన సామాజికవర్గాలకు బీసీ కార్పొరేషన్ కింద రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2,870 స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికిగాను రూ.56.11 కోట్లు కేటాయించింది. మొత్తం సొమ్ములో రూ.28.05 కోట్లు రాయితీగా ఇవ్వాలని నిర్ణయించింది. అప్పట్లో లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు కూడా పూర్తిచేశారు. టీడీపీ కూటమి నాయకులు ఇచ్చిన జాబితా మేరకే అప్పట్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశారనే విమర్శలు ఉన్నాయి. ఇది జరిగి ఏడాది దాటుతున్నా ఇంతవరకూ లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమకాలేదు. అప్పట్లో కొంతమంది ఖాతాల్లో రూపాయి పడినట్టు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా వారికి ఎదురుచూపులే మిగిలాయి. బ్యాంకులు రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. రాయితీ సొమ్ము ప్రభుత్వం విడుదల చేయకపోవడంతోనే ప్రక్రియ నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
నర్సరీలు, పుట్టగొడుగుల పెంపకం, నీటి ఇంజన్లు, ట్రాక్టర్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, కొబ్బరి వ్యాపారం, ఫిషింగ్ బోట్లు, హోటళ్లు వంటి 100కుపైగా యూనిట్లు ఏర్పాటుచేసుకోవచ్చని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఒక్కో లబ్ధిదారుడు కనిష్టంగా రూ.లక్ష, గరిష్టంగా రూ.5 లక్షలు పొందవచ్చని చెప్పారు. యూనిట్ ధర అనుసరించి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ రాయితీ పొందుతారని చెప్పుకొచ్చారు. రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తామన్నారు. అయినా ఇంతవరకూ లబ్ధిదారులకు రుణం అందకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అప్పట్లో 21,649 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను ఎంపిక చేయడానికి ఆయా మండలాల అధికారులు, బ్యాంకర్ల సమక్షంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులను గుర్తించి ఆయా బ్యాంకులకు వివరాలు పంపారు. అక్కడితో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే మంజూరైన యూనిట్ల కంటే అధికంగా దరఖాస్తుల రావడంతో ప్రక్రియ నిలిచిపోయినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ఏడాది కిందట బీసీ కార్పొరేషన్ రుణాల ప్రకటన
ఇంటర్వ్యూలు సైతం పూర్తి
లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ
ప్రభుత్వం తీరుపై విమర్శలు
ఎదురుచూపులు ఎన్నాళ్లు?


