రిటైర్డు నేవీ ఉద్యోగి ఇంట్లో చోరీ
● ఐదు తులాల బంగారు వస్తువులు అపహరణ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని పీఎన్‌కాలనీ రెండో లైన్‌లో నివాసముంటున్న రిటైర్డ్ నేవీ ఉద్యోగి ఎ.వి.రత్నం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 5 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో లైన్‌లోని సత్యసాయిబాబా మందిరానికి వెళ్లే దారిలో వనిత బొటిక్ పక్కనే ఉన్న నివాసంలో ఎ.వి.రత్నం తన భార్యతో కలిసి ఉంటున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న కుమారుడి వద్దకు గత నెల 24న వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అక్కడి వాచ్‌మేన్ పరిశీలించగా ఇంటి కుడివైపు పోర్టికో పక్కన కిటికీ గ్రిల్ వంగి ఉండటాన్ని గమనించాడు. చోరీ జరిగిందన్న అనుమానంతో 112కు కాల్‌చేశాడు. రెండో పట్టణ ఎస్‌ఐ లక్ష్మి, ఫింగర్ ప్రింట్ సీఐ భరత్, క్లూస్ టీమ్ సభ్యులు ఘటనా స్థలికి చేరి పరిశీలించారు. ఇంటికి సమీపంలోనే సీసీ కెమెరాలుండటం, కారుపై కాలిబూట్ల మరకలు ఉండటం గమనించారు. ఈలోగా ఎ.వి.రత్నం బావమరిది సిమ్మ రాజశేఖర్ వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా లోపల హ్యాండ్‌బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా ఉండటం గుర్తించారు. ఎ.వి.రత్నంతో ఎస్‌ఐ లక్ష్మి ఫోన్లో మాట్లాడగా.. బీరువాలో రుద్రాక్షలు కూడిన బంగారు గొలుసు, నల్లపూసల తాడు, కొంత వెండి సెంటిమెంట్ ప్రకారం దాచుకున్నామని, మిగతాదంతా బ్యాంకు లాకర్లలో దాచామని చెప్పారు. 4 నుంచి 5 తులాల బంగారం చోరీకి గురై ఉండవచ్చన్నారు. ఇంటి యజమానులు రాకపోవడంతో ప్రస్తుతానికి కేసు నమోదు కాలేదని సీఐ ఈశ్వరరావు చెప్పారు.
రిటైర్డు నేవీ ఉద్యోగి ఇంట్లో చోరీ


