21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు | - | Sakshi
Sakshi News home page

21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు

Feb 10 2026 8:10 AM | Updated on Feb 10 2026 8:10 AM

21 ను

21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు

అరసవల్లి: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా దివంగత కొన్నా చిన్నారావు, చిన్నమ్మడు చారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో ఈ నెల 21 నుంచి 23 వరకు జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో నిర్వహిస్తున్నట్లు శ్రీసుమిత్ర కళాసమితి అధ్యక్షుడు, ఆదిత్యాలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం అరసవల్లిలో ఆహ్వాన పత్రికలను సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకరశర్మ మాట్లాడుతూ మూడు రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి నాటికల ప్రదర్శన మొదలవుతుందన్నారు. 21న ‘మాయాజాలం’, ‘తరమెల్లిపోతున్నదో’, 22న ‘సమయం’, ‘సూక్తం’, 23న ‘మమ్మల్ని బ్రతకనివ్వండి..’, ‘నిన్ను నీవు గెలుచుకో..’ తదితర నాటికలు ప్రదర్శితమవుతాయని ప్రకటించారు. అనంతరం విశిష్ట అతిథుల చేతులమీదుగా బహుమతి ప్రదానంతో మూడు రోజుల కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. కార్యక్రమంలో సుమిత్ర కళాసమితి సభ్యులు మండవల్లి రవి, నక్క శంకరరావు, కొంక్యాన మురళి, కర్రి అశోక్‌కుమార్‌, ప్రధాన విజయరాం, కొమ్మనాపల్లి హరికృష్ణ, ఫల్గుణరావు, పందిరి సంగీత, వీవీఎస్‌ఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

చదరంగంతో మేధాశక్తి

టెక్కలి: చదరంగంతో మేధాశక్తి మరింత పెరుగుతుందని టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ వి.వి.నాగేశ్వరరావు అన్నారు. ఆదిత్య కళాశాలలో అంతర్‌ కళాశాలల చదరంగం పోటీలను సోమవారం ప్రారంభించారు. జేఎన్‌టీయూవీ స్థాయి టోర్నమెంట్‌ కోసం క్రీడాకారుల ఎంపికలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 కళాశాలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. జీఎంఆర్‌ఐటీ పీడీ పి.అరుణ్‌కుమార్‌, జేఎన్‌టీయూ పీడీ డి.నాగరాజు తదితరులు ఈ పోటీలకు పర్యవేక్షకులుగా వ్యహరిస్తున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎ.ఎస్‌.శ్రీనివాసరావు, కో–ఆర్డినేటర్‌ మురళీధర్‌, పీడీలు లక్ష్మణమూర్తి, మురళీమోహన్‌, తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

హయ్యర్‌ పింఛన్‌ కోసం పెన్షనర్ల ధర్నా

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది పింఛనుదారులు హయ్యర్‌ పెన్షన్‌ కోసం దరఖాస్తు చేయగా వారిలో ఎక్కువ మంది దరఖాస్తులు తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఆల్‌ పెన్షనర్స్‌, అండ్‌ రిటైర్డు పెన్షన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని జ్యోతీరావు పూలే పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వాకం వల్ల పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు, కరువు భత్యం చెల్లించాలన్నారు. లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని డిమాండ్‌ చేశారు. పింఛనుదారులు సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ప్రకటించారు. నిరసన కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పి.సుధాకర్‌, బి.జనార్దన్‌, పి.వాసుదేవరావు, బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

లాడ్జిలో వ్యక్తి మృతి

రణస్థలం: పైడిభీమవరంలో ఓ లాడ్జీలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాకేష్‌ కుమార్‌(46) అనే వ్యక్తి మృతి చెందాడు. పూసపాటిరేగ మండలంలోని ఒక ప్లైవుడ్‌ పరిశ్రమలో పని కోసం మూడు రోజుల క్రితం వచ్చిన ఈయన పైడిభీమవరంలోని ఎస్‌ఎస్‌ లాడ్జిలో దిగాడు. ఆదివారం రాత్రి భోజనం కోసం లాడ్జి నిర్వాహకులు రాకేష్‌ రూమ్‌కు వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించాడు. వెంటనే జె.ఆర్‌.పురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతని వద్ద లభించిన మందుల ప్రకారం అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. రాకేష్‌కుమార్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్‌.పురం ఎస్సై ఎస్‌.చిరంజీవి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు 1
1/3

21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు

21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు 2
2/3

21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు

21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు 3
3/3

21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement