వైభవంగా ఆదిత్యుని కల్యాణ సేవ
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనివెట్టి మండపంలో ఏకాదశి కల్యాణ సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ సతీసమేతంగా హాజరై పూజలు చేశారు. అంతకుముందు ఉత్సవమూర్తులను పుష్పాలంకరణ చేసి శ్వేత అశ్వ వాహనంలో కొలువుదీర్చి మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో మంగళధ్వనుల మధ్య ఉత్తర (వైకుంఠ) ద్వారం లోంచి ఆలయంలోకి ఉత్సవమూర్తులను తీసుకువెళ్లారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి నగేష్ కాశ్యప, రంజిత్ శర్మ, సాందీప్‌శర్మ, క్షేమేంద్ర శర్మ, హరిప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.


