ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
● రెండేళ్లు దాటుతున్నా
అమలుకు నోచుకోని
చంద్రబాబు హామీలు
● వంశధార నిర్వాసితులకు తప్పని ఇబ్బందులు
● పట్టించుకోని కూటమి
పాలకులు
హిరమండలం :
‘వంశధార నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం. అదనపు పరిహారం అందిస్తాం. పునరావాస గ్రామాలు, కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. మిగుల భూముల సమస్యలను పరిష్కరిస్తాం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం చేసి చూపిస్తాం’.. ఇవీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు 2023 ఆగస్టు 10న ప్రాజెక్టులపై యుద్ధభేరిలో భాగంగా హిరమండలం, కొత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో చేసిన ప్రకటనలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తోంది. అయినా ఇంతవరకు వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు. అసలు వారి సమస్యలపై దృష్టిపెట్టిన వారే కరువయ్యారు. దీంతో నిర్వాసితుల సమస్యలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది.
బలవంతంగా ఇళ్లు ఖాళీ..
2005లో వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామాల్లో రెవెన్యూ, భూసేకరణ అధికారులు నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక ముందే నిర్వాసితులకు మెరుగైన వసతులు కల్పిస్తామని ఉపాధి, ఉద్యోగం కల్పిస్తామని హామీలు ఇచ్చారు. కానీ 2017లో టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఇప్పటికీ నిర్వాసితులు మరిచిపోలేకపోతున్నారు. అదే ఏడాది సెప్టెంబరు 17 నుంచి డిసెంబరు 30 వరకూ ఇళ్లు పడగొట్టారు. కనీసం పండుగ చేసుకున్న వరకూ విడిచిపెట్టాలని కోరినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. దీంతో సుమారు 10 వేల కుటుంబాలు తలోదిక్కుకు వెళ్లిపోయాయి. కొందరు తెలిసిన వారు, బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. మరికొందరు పునరావాస కాలనీల్లో రేకుల షెడ్లను ఏర్పాటుచేసుకున్నారు. కానీ అదే ఏడాది వచ్చిన తితలీ తుఫాను వారి తాత్కాలిక నివాసాలను నేలమట్టం చేసింది. అయితే నిదానంగా కోలుకున్నారు. కానీ నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు.
భారీగా అవకతవకలు..!
టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వాసితుల పరిహారం పంపిణీలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నేతలకు అప్పట్లో పెద్దపీట వేసినట్టు విమర్శలు వ్యక్తమయ్యాయి. అర్హులకు మొండిచేయి చూపించి అనర్హులకు అందలం ఎక్కించారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రూ.216 కోట్ల అదనపు పరిహారం మంజూరు చేసింది. నిర్వాసితులందరికీ రూ.లక్ష వంతున అదనంగా పరిహారం అందించింది. అయితే ప్రతిపక్ష నేతగా ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన క్రమంలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు.
ఎక్కడి సమస్యలు అక్కడే..
ఎల్‌ఎన్‌పేట మండలం శ్యామలాపురం, మోదుగులపేట, తాయిమాంబాపురం, జగన్నాథపురం.. ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస..కొత్తూరు మండలం గూనభద్ర, మెట్టూరు, మహాసింగి.. సీతంపేట మండలం పులిపట్టి.. హిరమండలంలోని సుభలాయి ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో 80 శాతం నిర్వాసితులు ఉంటున్నారు. ఆయా చోట్ల రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. నిధులు మంజూరైనా కొన్నిచోట్ల ఆలయాలు నిర్మించలేదు. ఇక మిగుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో సాగుకు వీలుపడడం లేదు. రానున్న మూడున్నరేళ్లలో అయినా నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి..
నిర్వాసితులకు సంబంధించి అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సీఎం చంద్రబాబు రెండేళ్ల కిందట ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలుకాలేదు. పునరావాస గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. – బి.వి.వి.సత్యనారాయణ, నిర్వాసితుడు, తులగాం
పరిస్థితి దారుణం..
మా పరిస్థితి దారుణంగా మారింది. రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేశాం. అయినా మా త్యాగాలకు విలువ లేకుండా పోయింది. పరిహారంతో పాటు మంచి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. అనేక హామీలు ఇచ్చారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. – జి.పద్మావతి, నిర్వాసితురాలు, పాడలి
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?


