ప్రతి షాపు నుంచి ముడుపులు
నిఘా
● హోల్‌సేల్ ఎరువుల
డిస్ట్రిబ్యూటర్ల చేతిలో చిక్కుకుపోయిన జిల్లా
● ఓ మంత్రి అండతో
చెలరేగిపోతున్న
ఆ నలుగురు
● అధికారులను సైతం
శాసిస్తున్న పరిస్థితి
ఎరువుల షాపుల జోలికి అధికారుల రాకుండా చూస్తామంటూ జిల్లాలో ఉన్న ప్రైమ్ డీలర్లు, రిటైలర్ల దగ్గరి నుంచి ఏటా షాపు కింత అని వసూలు చేస్తున్నారు. గత ఏడాది షాపునకు రూ.5వేలు వసూలు చేస్తే ఈ ఏడాది రూ.10వేలు వసూలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఆరుగురు హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లు, 30 మంది వరకు ప్రైమ్ డీలర్లు, మరో 270 వరకు రిటైలర్లు ఉన్నారు. దీన్ని బట్టి అధికారుల ముడుపుల పేరు చెప్పి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా రిటైలర్, ప్రైమ్ డీలర్ ఇవ్వకపోతే వారిపై అధికారుల చేత దాడులు చేయించి భయపెట్టిన సందర్భాలూ ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఆ నలుగురు.. జిల్లాలో ఎరువుల పంపిణీ వ్యవస్థను శాసిస్తున్నారు. ఓ మంత్రి అండదండలతో అధికారులపై సైతం పెత్తనం చెలాయిస్తున్నారు. ఎరువుల ధరలను ఇష్టారీతిన పెంచేసి, రైతులపై మోయలేని భారాన్ని మోపుతున్నారు. రైతులకు సరిపడా ఎరువులను సరఫరా చేయడంలో ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆ నలుగురిదీ ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఖరీఫ్‌లో ఎరువుల కష్టాలు ఎవ రూ మర్చిపోలేదు. రబీలోనూ అదే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. రైతుల అవసరం మేరకు ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయకపోవడం, అందుబాటులో ఉన్న ఎరువుల ధరలు భారీగా పెరి గిపోవడంతో రైతులు విసిగి వేసారి పోతున్నారు.
సిండికేట్‌గా ఆ నలుగురు..
జిల్లాలో హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లు పాతుకుపోయారు. కొత్త వారు రాకుండా అడ్డుకునే స్థాయికి వెళ్లిపోయారు. ఆసక్తి చూపించే వారికి రకరకాల ఇబ్బందులను పెట్టి ఆదిలోనే నిలువరిస్తున్నా రు. పొరుగునున్న విజయనగరం జిల్లాలో 20 మందికి పైగా, విశాఖపట్నం జిల్లాలో 30మందికి పైగా, గోదావ రి జిల్లాల్లో 100 మందికి పైగా హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటే మన జిల్లాలో మాత్రం ఆరుగురు మాత్ర మే హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వీరిలో ఓ నలుగురు డిస్ట్రిబ్యూటర్లు అంతా తామై వ్యవహరిస్తు న్నారు. రాజకీయ అండదండలతో జిల్లాను శాసిస్తున్నారు.
మూడొంతుల ఎరువులు వీరి ద్వారానే..
జిల్లాకు వచ్చిన ఎరువులో మూడొంతులకు పైగా ఇక్కడ హోల్‌సేల్ సిండికేట్ ద్వారానే రిటైలర్స్‌కు వెళ్తుంది. ఆమదాలవలసలో ఒకరు, టెక్కలిలో ఇద్దరు, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒకరు కలిసి ఈ సిండికేట్‌లో కీలకంగా ఉన్నారు. వీరందరికీ అధికార పార్టీ నేతలు అండదండగా నిలవడంతో వీరి సిండికేట్ బలంగా, దృఢంగా దశాబ్దాల నుంచి కొనసాగుతుందని జిల్లాలో రిటైలర్ డీలర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఓ మంత్రికి సన్నిహితంగా మెలిగే కోటబొమ్మాళికి చెందిన ఒక వర్తకుడు వీరందరికీ పెద్ద దిక్కుగా నిలబడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కోరమాండల్, ఎన్‌ఎఫ్‌ఎల్, ఇఫ్కో, క్రిబ్‌కో, స్పిక్, ఆర్‌సీఎఫ్ తదితర ఫెర్టిలైజర్ కంపెనీలు తొలి నుంచి వీరికే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి.
అసోసియేషన్ సైతం అసహనం
జిల్లా ఫెర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ సైతం ఆ నలుగురిపై పలుమార్లు తీవ్ర అసహనం ప్రకటించినట్లు సమాచారం. హోల్‌సేల్‌గా ధరలు బిల్లింగ్ కంటే అదనంగా చీకటి ధరలు సైతం వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక యూరియా బస్తా హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌కు రూ.238కి వస్తుంది. రిటైలర్‌కు వెళ్లే సమయానికి రూ.20 ట్రాన్స్‌పోర్టు చార్జీల కింద యాడ్ అవుతుంది. ఇదంతా అధికారికంగా చూపిస్తున్నది. కానీ రిటైలర్ నుంచి బస్తాకు అదనంగా రూ.50 నుంచి రూ.60 వరకు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. దీంతో రిటైలర్‌కు వచ్చేసరికి దూరాన్ని బట్టి రూ.310 నుంచి రూ.320 అవుతుంది. దీనికి రిటైలర్లు మరికొంత వేసుకుని అమ్ముకోవాల్సి వస్తోంది. ఇదే రైతుకు భారమవుతోంది. మరోవైపు డీబీటీలో డమ్మీ అథంటికేషన్‌లు వేసి బస్తాకు రూ.500 వరకు అమ్ముకుని సొమ్ముచేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అదనపు వడ్డన చాలదన్నట్టు రైతుకు లింక్ ప్రొడక్ట్స్ బల వంతంగా అంటగడుతున్నారు. లింక్ ప్రొడక్ట్స్ తీసుకుంటే తప్ప సబ్సిడీ ఎరువులను ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి బస్తాకు లింక్‌పెట్టి రిటైలర్స్‌కు అంటగట్టే సంప్రదాయం సైతం జిల్లాలో ‘ఆ నలుగురు’ నుండే ప్రారంభమైంది. ఇలా రోజుకొక కొత్త ఆలోచనతో రిటైలర్స్‌కు కూడా గిట్టుబాటు కాకుండా చేసి తద్వారా రైతుల నడ్డివిరిచే కార్యక్రమం జరుగుతుంది. రాజకీయ పలుకుబడి ఉండడంతో ఎరువులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చేయడానికి వచ్చే అధికారులను ఎదురించే స్థాయికి వెళ్లిపోయారు. ప్రధానంగా ఓ మంత్రి అండగా నిలవడంతో అధికారులు సైతం జీ హూజూర్ అనాల్సి వస్తోంది.
అన్నీ కాకి లెక్కలు..
జిల్లాలో రబీలో 1,75,797 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు 1,05,775 ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వరి 50,255 ఎకరాలు, మొక్కజొన్న 36,180 ఎకరాలు, మినప 36,180 ఎకరాలు, పెసర 19,610 ఎకరాలు, వేరుశనగ 5310 ఎకరాలు, రాగి 2492.5 ఎకరాలు, ఉలవలు 627.5 ఎకరాలు, చెరుకు 890 ఎకరాలు, నువ్వులు 427.5 ఎకరాల్లో సాగులోకి వచ్చినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ వీటిలోనూ వాస్తవికత లేదని తెలుస్తోంది. రబీ సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరులోగా సాగు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే సాగులోకి వచ్చిందని అధికారికంగా చూపిస్తున్న లెక్కలే గతం కంటే భారీగా తగ్గిపోయిందని చెబుతున్నాయి. పోనీ సాగు చూపిస్తున్న మేరకై నా ఎరువులు సమకూర్చుతుందా అంటే అదీ లేదు. రబీ లెక్కల ప్రకారం 30 వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా అవసరం ఉండగా, అధికార యంత్రాంగం 12,457 మెట్రిక్ టన్నులే అవసరముందని నివేదికలు రూపొందించింది. ఇందులో 9,521 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చేసిందని కూడా చూపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. యూరియా దొరక్క ఖరీఫ్ మాదిరిగానే రబీలోనూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధలు భరించలేక చాలా మంది సాగును వదులుకుంటున్నారు.
సాక్షి
ప్రతి షాపు నుంచి ముడుపులు
ప్రతి షాపు నుంచి ముడుపులు
ప్రతి షాపు నుంచి ముడుపులు


