ఉన్నది పోయె.. కొత్తది రాకపాయె!
టాక్
హిరమండలం:
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కలమట వెంకటరమణమూర్తిని పదవి నుంచి తొలగించారు. ఆ పదవిని ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన మొదలవలస రమేష్‌కుమార్‌కు కట్టబెట్టారు. 2024 ఎన్నికల సమయంలో కలమట వెంకటరమణమూర్తికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. పాతపట్నం నియోజకవర్గ టిక్కెట్ మామిడి గోవిందరావుకు ఇవ్వడంతో అప్పటివరకూ ఇన్‌చార్జిగా ఉన్న వెంకటరమణమూర్తి కలత చెందారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో పార్టీ అధిష్టానం టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పోస్టు కానీ, ఎమ్మెల్సీ పదవి కానీ కేటాయిస్తామని చెప్పింది. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెల లు అవుతోంది. నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేశారు. కానీ కలమట వెంకటరమణమూర్తి పేరును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు టీడీపీ అధ్యక్ష పదవి నుంచి సైతం తొలగించారు. దీంతో కలమట అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
సుదీర్ఘ నేపథ్యం..
కలమట కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. కలమట మోహనరావు రాజకీ య వారసుడిగా తెరపైకి వచ్చారు కలమట వెంకటరమణమూర్తి. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ కొద్దికాలనికే టీడీపీలోకి ఫిరాయించారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ దక్కుతుందని భావించారు. కానీ వెంకటరమణకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. మామిడి గోవిందరావుకు టిక్కెట్ ఇవ్వడంతో ఆయన గెలిచారు. అయితే గోవిందరావు గెలుపు కోసం కృషిచేసిన వెంకటరమణమూర్తికి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే ఏడాదిన్నరకే ఆ పదవి నుంచి తొలగించారు. పైగా ఎలాంటి నామినేటెడ్ పోస్టు కానీ, ఎమ్మెల్సీ పదవి కానీ కేటాయించలేదు. అయితే టీడీపీ అధ్యక్ష పదవి ఖర్చుతో కూడుకున్నదని.. అందుకే నామినేటెడ్ పదవి ఇవ్వాలని కలమట కోరినట్టు ప్రచారం జరుగుతోంది. టిక్కెట్ త్యాగం చేసిన తమ నేతకు పదవులు దక్కకపోవడంపై ఆయన అభిమానులు ఆవేదనతో ఉన్నారు.
పొలిటికల్
కలమట వెంకటరమణకు దక్కని నామినేటెడ్ పదవి
అమలు కాని ఎమ్మెల్సీ హామీ
ప్రస్తుతం ఉన్న టీడీపీ అధ్యక్ష పదవి తొలగింపు
తీవ్ర అంతర్మథనంలో అభిమానులు


