
లారీ డ్రైవర్‌కు జైలుశిక్ష
ఎచ్చెర్ల : మద్యం మత్తులో లారీని నడుపుతూ ప్రమాదానికి కారణమైన విజయవాడకు చెందిన డ్రైవర్ నాగరాజుకు జిల్లా సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 60 రోజుల జైలు శిక్ష విధించారు. ఎచ్చెర్ల మండలం కింతలి మిల్లు జంక్షన్ వద్ద సోమవారం అర్ధరాత్రి విజయవాడ నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నాగరాజు రాంగ్‌రూట్‌లో డ్రైవ్ చేస్తూ విశాఖ నుంచి ఒడిశా వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒడిశా లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్ నాగరాజుపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలించగా 60 రోజులు జైలు శిక్షను విధించారని ఎస్సై సందీప్‌కుమార్ మంగళవారం తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితురాలు
మెళియాపుట్టి: పట్టుపురంలో కాంచనే అనే మహిళపై దాడి చేసి పారిపోయిన ఘటనలో అనుమానితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పాతపట్నం సీఐ వి.రామారావు తెలిపారు. పూర్తి వివరాలు బుధవారం తెలియజేస్తామన్నారు.
రాత్రిపూట యూరియా అమ్మకాలా?
నరసన్నపేట: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటైన సొసైటీల్లో చీకటి పడ్డాక యూరియా అమ్మకాలు చేస్తుండటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నరసన్నపే ట సొసైటీకి మూడు రోజుల కిందట 400 బస్తా ల యూరియా వచ్చింది. ఆదివారం రైతులు అధికంగా చేరడం.. వాగ్వాదం జరగడంతో యూరియా పంపిణీ చేయలేదు. రెండో రోజు కొంత మంది రైతులకు ఒక్కో బస్తా చొప్పున ఇచ్చారు. మిగిలిన యూరియాను మంగళవారం రాత్రి విక్రయాలు చేపట్టారు. ఆటోలు, లగేజి వాహనాల్లో బస్తాలను ఇష్టానుసారంగా సరఫరా చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఇవ్వాల్సిన యూరియా పక్కతోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో సొసైటీకి వచ్చిన యూరియా పక్క దారి పట్టిందని, కావాల్సిన వారికి లెక్కకు మించి పంపిణీ చేశారని పలువురు రైతులు అంటున్నారు.
‘కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు నేడు హాజరుకావాలి’
శ్రీకాకుళం రూరల్: గత డిసెంబర్, జనవరి నెలల్లో ఎచ్చెర్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కానిస్టేబుళ్ల ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై సివిల్, ఏపీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికై న పురుష, మహిళా అభ్యర్థులంతా ఈ నెల 20న బుధవారం శ్రీకాకుళం రూరల్ మండలం తండేంవలసలోని పోలీసు శిక్షణా కేంద్రం (ఆర్‌టీ ఓ కార్యాలయం దరి) ఉదయం 9 గంటలకల్లా హాజరుకావాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సెలక్షన్ ప్రక్రియలో దరఖాస్తుతో జతపర్చిన అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఇటీవలే తీయించిన మూడు పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, హాజరైన అభ్యర్థి అటస్టేషన్ ఫారం పూర్తి వివరాలతో పాటు గెజిటేడ్ అధికారితో ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని పేర్కొన్నారు.