
ఆదాయమే పరమావధా..?
● శ్రీముఖలింగంలో సంప్రదాయాలకు విరుద్ధంగా హుండీ ఏర్పాటు
● భక్తులు విన్నవించుకున్నా పట్టించుకోని అధికారులు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం దక్షిణ కాశీగా పేరొందింది. ఇక్కడ స్వామిని దర్శించుకునేందుకు దేశ నలుమూలలు నుంచి భక్తులు, విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. అయితే ఎంతో చరిత్ర, విశిష్టత ఉన్న ఉన్న ఈ దేవాలయంలో దేవదాయ శాఖ అనాలోచిత నిర్ణయాలు భక్తుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఆదాయ మే పరమావధిగా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. ఎక్కడైనా శైవ దేవాలయాల్లో శివలింగం(స్వామివారు)కి దగ్గరలో కొన్ని అడుగులు దూరంలో నందిని ప్రతిష్టిస్తారు. పూజలు, అభిషేకాలు, దర్శనాలు అర్చనలు తదితరవి నిర్వహించే సమయంలో ముందుగా నందిని పూజించి తర్వాత శివునికి అభిషేకం చేస్తారు. శివునికి నందికి మధ్యలో ఎవరూ అడ్డంగా రాకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. అలాంటిది కేవలం ఆదాయ మే ధ్యేయంగా ప్రధాన దేవాలయంలో స్వామికి నందికి మధ్యలో మూడు చోట్ల నాలుగైదు హుండీలు ఏర్పాటు చేశారు. దీనిపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈఓకు విన్నవించామని, అయినా చర్యలు తీసుకోలేదని విశాఖకు చెందిన ఓ భక్తుడు తెలిపాడు. దీనిపై ఈఓ టి.వాసుదేవరావును వివరణ కోరగా హుండీలు తొలగిస్తానని తెలిపారు.