
‘దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించాలి’
సోంపేట: రాష్ట్రం ప్రభుత్వం ఇటీవల తొలగించిన దివ్యాంగ పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగుల సంఘం హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శులు మల్లారెడ్డి భాస్కర్, దశముఖ రమేష్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గు రువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 1458 మంది దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. మళ్లీ అప్పీలు చేసుకోవాలని దివ్యాంగులను కార్యాలయాల చుట్టూ తిప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇచ్ఛాపురం, పలాస నియోజక వర్గాల్లోని ది వ్యాంగులకు ఉపకరణాలు అందలేదని, ప్రభుత్వం స్పందించి ఉపకరణాలు అందేలా కృషిచేయాలన్నారు. సమావేశంలో పోకల మోహనరావు, ఎం.పీతాంబరం తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లా స్థాయి జానపద పాటల పోటీలు
వజ్రపుకొత్తూరు రూరల్: ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మందస మండలం బహడపల్లిలో శుక్రవారం జిల్లా స్థాయి సామాజిక జానపద పాటల పోటీలు నిర్వహించనున్నారు. సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో పోటీలను విజయవంతం చేయా లని కళావేదిక అధ్యక్షుడు మామిడి కృష్టారావు, ప్రతినిధి రాపాక ధనరాజు,కార్యదర్శి లబ్బ రుద్రయ్య కోరారు. అలాగే అదే గ్రామంలో ఉ న్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 2 గంటలకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పేర్లను అదే రోజు ఉదయం లోగా నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440861442 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని వారు సూచించారు.
రణస్థలం సబ్‌స్టేషన్ ఆకస్మిక తనిఖీ
రణస్థలం: రణస్థలం సబ్ స్టేషన్‌ను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫీడర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సమస్యలు రాకుండా విద్యుత్ అందించాలని సూచించారు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. కమ్మసిగడాం పరిధిలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా వేసిన విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరుపై ఆరా తీశారు. నూతనంగా నిర్మిస్తున్న బంటుపల్లి సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ పీవీ సూర్య ప్రకాశ్, జిల్లా ఎస్‌ఈ కృష్ణమూర్తి, డీఈ పైడి యోగేశ్వరరావు, ఈఈ బయ్యంనాయుడు, రణస్థలం ఏడీ ఎం.రాజేష్, ఏఈ జి.తిరుపతిరావు ఉన్నారు.
మూడు గంటల పాటు గేటు బంద్
ఇచ్ఛాపురం రూరల్: కేదారిపురం–పురుషోత్తపురం మధ్యనున్న రైల్వే ఎల్‌సీ గేట్‌ను రైల్వే సిబ్బంది మూడు గంటల పాటు మూసివేశారు. ట్రాక్ మరమ్మతుల పేరిట ముందస్తు సమాచారం లేకుండా గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గేట్ మూసి వేయడంతో విద్యార్థులు, ఉద్యోగులతో పాటు వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.
అంతర్ జిల్లా బదిలీలకు పచ్చ జెండా
శ్రీకాకుళం: రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు బదిలీ కావాలనుకునే ఉపాధ్యాయులు ఈనెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించారు. స్పౌజ్, మ్యూచువల్ కేటగిరీల్లో మాత్రమే బదిలీలు జరుపుతామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం వా రు పనిచేస్తున్న జిల్లా, బదిలీ కావాల్సిన జిల్లా వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. కొత్త ప్రొఫార్మాలో ఈ వివరాలను పొందుపరిచి డీఎస్సీ ఏపీ ద్వారా ధ్రువీకరించుకోవాలి. వేరొ క జిల్లాకు బదిలీ అయినప్పుడు ప్రస్తుత జి ల్లాలోని సీనియార్టీని కోల్పోయి, అక్కడ చివరి ర్యాంకుల్లో చేరుతారు. ఈ ఏడాది జూలై 31 నాటికి కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

‘దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించాలి’