
మంత్రి అచ్చెన్నను విచారించాల్సిందే..
● మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆమదాలవలస: కూటమి పాల న అవినీతికి కేంద్ర బిందువులా మారిందని, కోట్ల రూపాయల స్కాం చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెగబడ్డారని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ సమయన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన గురువారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను దోపిడీకి సాధనాలుగా మలుచుకోవడం సరికాదన్నారు. వ్యవసాయ పరికరాల కొనుగోళ్లలో కమీషన్ల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని తెలిపారు. ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడం మంత్రి పేషీలోని అవినీతికి నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి, ఓఎస్డీపై నిఘా సంస్థలు విచారించాలన్నారు. మంత్రిపై ఆరోపణలు చేస్తూ ఓ ఉన్నతాధికారి ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. మంత్రి నిర్వాకంతో కూటమి ప్రభుత్వ పరువు బజారులో పడిందన్నారు. సీఎం చంద్రబాబు ఈ విషయంలో తన ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
సంక్షోభంలో సాగు..
రాష్ట్రంలో వ్యవసాయశాఖ తీవ్ర సంక్షోభంలో కూరు కుపోయిందని తమ్మినేని మండిపడ్డారు. వానలు ఆలస్యమయ్యాయని, సాగు ప్రారంభించిన వారికి సరిపడా విత్తనాలు, ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మార్కెట్‌లో ఎరువులు లభించడం లేదన్నారు. సబ్సిడీతో అందించాల్సిన ఎరువులు కూట మి నేతల ఆధీనంలోని ప్రత్యేక గోడౌన్లకు వెళ్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు.
పింఛన్‌దారుల కుదింపు అన్యాయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,50,000 మంది అర్హులైన వారిని పింఛన్ల జాబితా నుంచి తొలగించారని, ఇది అన్యాయమని అన్నా రు. మానవతా కోణంలో ఆలోచించి, తొలగించిన లబ్ధిదారులందరినీ తిరిగి పింఛన్ల జాబితాలో చేర్చేలా పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు.