
ఆదిత్యుని సన్నిధిలో న్యాయమూర్తి తుహిన్ కుమార్
అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ సతీసమేతంగా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు గౌరవంగా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలను చేయించి, ఆలయ విశిష్టతను శంకరశర్మ వివరించారు. అనంతరం అనివెట్టి మండపంలో వేదాశీర్వచనాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. వారితో పాటు జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి హరిబాబు, ఆర్డీవో సాయి ప్రత్యూష తదితరులు ఉన్నారు.
రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లావేరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలో జలుమూరు మండలంలోని గోటివాడ గ్రామానికి చెందిన ముక్త పవన్ కుమార్ (25) విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గత రెండు రోజులు సెలవులు కావడంతో ఇంటికి వచ్చి ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యాడు. జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10 గంటల సమయంలో లావేరు మండలంలోని తాళ్లవలస వచ్చేసరికి ముందు వెళ్తున్న ఆటో సడన్‌గా రోడ్డుపై నీరు ఉందని తిప్పాడు. దీంతో ఆటోను తప్పించి అధిగమించే క్రమంలో వెనువెంటనే వెనుక వచ్చిన వ్యాను బలంగా ఢీకొట్టింది. దీంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తండ్రి నరిసింగరావు, తల్లి ఉషారాణి, సోదరుడు సాయి ఉన్నారు. రోడ్డు ప్రమాదంపై లావేరు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రిమ్స్‌లో యువకుడి
అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన మురపాక అక్కయ్య (30) పచ్చ కామెర్ల వ్యాధితో ఇటీవల చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. సోమవారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఉన్న బాత్రూమ్ వైపు అక్కయ్య వెళ్లాడు. తిరిగి వస్తుండగా జారిపడి స్పృహ కోల్పోయాడు. అక్కడికి కొద్ది సమయంలోనే వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించినా మృతికి గల కారణాలు తెలియరాలేదు. రోగి కుటుంబ సభ్యులు బాత్రూమ్‌కు వెళ్లక ముందు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని వాపోతున్నారు. ఇదే విషయమై అవుట్ పోస్టు పోలీసుల వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా వైద్యులు సాధారణ మరణంగా ధ్రువీకరించి పంపించేశారన్నారు. బాత్రూమ్‌లో పడిపోవడం వాస్తవమేనని పేర్కొన్నారు.

ఆదిత్యుని సన్నిధిలో న్యాయమూర్తి తుహిన్ కుమార్

ఆదిత్యుని సన్నిధిలో న్యాయమూర్తి తుహిన్ కుమార్