
పీజీఆర్‌ఎస్‌కు 78 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లు సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా అందిన ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షిస్తూ, సమస్యల తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు కారణంగా ఈ వారం తక్కువగా వినతులు వచ్చాయి. ఈ వారం మొత్తం 78 ఫిర్యాదులు వివిధ శాఖలకు అందగా, వాటిలో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 14 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి సంబంధించి 11, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘానికి చెందిన 10, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 7, వ్యవసాయ శాఖకు చెందిన 6, మున్సిపల్ పరిపాలన శాఖకు సంబంధించి 6 ఫిర్యాదులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని ధర్మక్షేత్రనగర్‌లో నివాస గృహాలకు బదులుగా, ప్రైవేటు మెడికల్ కళాశాలకు సంబంధించిన తరగతి గదుల నిర్మాణం గుట్టుచప్పుడు లేకుండా చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో తక్షణమే స్పందించిన జేసీ శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌కు రిమ్స్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.