
అయ్యో.. హోమియో!
హోమియో వైద్యంతో నమ్మకంతో ఆస్పత్రికి వస్తున్నాం. వైద్యులు సేవలందిస్తున్నప్పటికీ అవసరమైన మందులు లేక వేరేచోట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచితే మంచిది.
– పొన్నాన హరిప్రసాద్,
లక్ష్మిపురం, సారవకోట మండలం
మందుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఏయే మందులు ఆస్పత్రికి అవసరమో వాటి వివరాలు పంపించాం. ఆయుష్ శాఖ మందులు పంపిస్తే రోగులకు అందుబాటులో వస్తాయి.
– ఉమాగౌరి, హోమియో వైద్యులు,
తెంబూరు, పాతపట్నం మండలం
● వైద్యులు లేక మూతపడుతున్న వైద్యశాలలు
● ఏడాదిగా సరఫరా కాని మందులు
సారవకోట: జిల్లాలో పలు హోమియో వైద్యశాలల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు మందులు కొరత, మరోవైపు వైద్యులు లేక పలు ఆస్పత్రులు తెరుచుకోవడం లేదు. దీంతో హోమియో మందులు వాడుతున్న రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలో ఆయుష్ విభాగంలో చీడిపూడి, శ్రీముఖలింగం, పాతపట్నం, తెంబూరు, పొన్నాడ, కింతలి, తొగరాం, బ్రాహ్మణతర్ల, తోటవాడ, శ్రీకాకుళం, జగతి, సంతవురిటి గ్రామాల్లో హోమియో వైద్యశాలలు ఏర్పాటు చేశారు. వీటిలో శ్రీముఖలింగం, తొగరాం, పాతపట్నం, బ్రహ్మణతర్ల ఆస్పత్రుల్లో వైద్యులు లేరు. పాతపట్నం, బ్రహ్మణతర్ల ఆస్పత్రుల్లో కాంపౌండర్లే ఆస్పత్రులు తెరుస్తున్నారు. శ్రీముఖలింగం, తొగరాంలలో వైద్యులు, సిబ్బంది లేక తెరుచుకోవడం లేదు. దీంతో ఆయా ప్రాంతాలలో హోమియో వైద్యం నమ్ముకున్న వారికి సేవలందని పరిస్థితి. వీరంతా శ్రీకాకుళం, ఇతర ప్రాంతాలలో ప్రైవేట్ హోమియో వైద్యులపై ఆధారపడుతున్నారు.
వెంటాడుతున్న మందుల కొరత..
జిల్లాలోని హోమియో ఆస్పత్రులకు రెండేళ్లుగా మందులు సరఫరా కావడం లేదు. అందుబాటులో ఉన్న అరకొర మందులను రోగులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని చోట్ల అవసరమైన మందులు ప్రయివేట్ మందుల దుకాణాలలో కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. సంవత్సరాల తరబడి మందులు సరఫరా చేయకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు పలు చోట్ల ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి హోమియో ఆస్పత్రులపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

అయ్యో.. హోమియో!

అయ్యో.. హోమియో!

అయ్యో.. హోమియో!