
జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలి
ఆమదాలవలస: పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో మంగళవారం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిందని మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఎన్నికలు జరిగిన గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయార ని అన్నారు. ఆయన మంగళవారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడారు. పక్క నియోజకవర్గాల నుంచి టీడీపీ గూండాలను దించి ఓటు వేయకుండా చేశారని విమర్శించారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాల్సిన పోలీస్ ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహించటం దారుణమని అన్నారు. కడప వైఎస్సార్ సీపీలో కీలకంగా ఉన్న వై ఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికలను తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు జరిగిన తీరును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యా న్ని పరిరక్షించాలంటే, ఉప ఎన్నికలను రద్దుచేసి, మరోసారి ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.