
యూరియా.. సరిపోతాయా..?
కొత్తూరు:
ఎరువుల కొరత రానురాను తార స్థాయికి చేరుకుంటోంది. నిన్న మొన్నటి వరకు అరకొర స్టాకుతో రైతులకు ఇబ్బంది తప్పలేదు. తాజాగా రైతుకు ఒక ఒకరాకు 25 కిలోల యూరియా మాత్రమే ఇవ్వాలని వ్యవసాయాధికారులు నిర్ణయించడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో వరి నాట్లు మొదలైన వెంటనే రైతులకు అవసరమైన యూరియా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేవారు. ప్రస్తుతం కూటమి పాలన తో రైతులకు అవసరమైన యూరియా రైతు సేవా కేంద్రాలకు కేటాయించలేదు. సరిపడా యూరియాను సరఫరా చేయకుండా ప్రభుత్వం సరికొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఒక ఎకరాకు వినియోగించే యూరియాను మూడు భాగాలుగా విభజించింది. ఎకరాకు యూరియా 75 కిలోలు అవసరంగా గుర్తించిన ప్రభుత్వం మొదటి విడతగా 25 కిలోలు మాత్రమే పంపిణీ చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో గ్రామ సచివాలయానికి వచ్చిన యూరియాను ఇద్దరు రైతులకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు.
అయితే ఎకరా కంటే ఎక్కువ వరి సాగు చేస్తున్న రైతులకు, పత్తి, చెరుకుతో పాటు కూరగాయలు సాగు చేసే రైతులకు 25 కిలోల యూరియా చాలకపోవడంతో వారికి పాట్లు తప్ప డం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కేంద్రాలకు యూరియా ఇస్తే కొరత ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పు డు యూరియా చాలకపోవడంతో రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. యూరియా ప్రభుత్వ ధర రూ. 280 ఉండగా ప్రైవేట్ డీలర్లు బస్తా రూ. 350 నుంచి రూ. 400లకు అమ్ముతున్నారు. అదనంగా డీఏపీ గానీ, దుబ్బు గుళికలు గానీ కొనుగోలు చేస్తే తప్ప యూరియాను విక్రయించడం లేదు.
రైతుకు 25 కిలోల యూరియా మాత్రమే ఇవ్వాలని నిర్ణయం
ఇద్దరు రైతులకు ఒక బస్తా పంపిణీ చేయాలంటూ ఆదేశాలు
తీవ్ర అసంతృప్తి వ్యక్తం
చేస్తున్న రైతులు
మూడు విడతలుగా అందిస్తాం
వరి సాగు చేస్తున్న రైతులు ఎకరాకు 75 కిలోల యూరియా వినియోగించాలి. కాబట్టి ఈ మొత్తంను మూడు విడతలుగా విభజించి మొదటి విడతగా 25 కిలోలు ప్రతి రైతుకు అందిస్తాము. యూరియా సర్దుబాటు కోసం రైతులందరికీ అందించాలన్న భావంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ అవసరం అయితే ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. ఇతర పంటలు సాగు చేస్తుంటే అయితే వాటికి యూరియా అందిస్తాము. – రాజగోపాలరావు,
ఏడీఏ వ్యవసాయ సబ్ డివిజన్, కొత్తూరు
పంపిణీ చేయలేకే ఈ నిర్ణయం
రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం పంపిణీ చేయలేక పోవడం వల్లనే 25 కిలోల యూరియా అంటూ పరిమితి పెట్టింది. ఒక్కో రైతు పదుల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు సాగు చేస్తారు. ఈ పంటలకు సరిపడిన యూరియా లభించడం లేదు. – వి.సంజీవరావు,
రైతు, కుడుము, కొత్తూరు మండలం

యూరియా.. సరిపోతాయా..?

యూరియా.. సరిపోతాయా..?

యూరియా.. సరిపోతాయా..?