లోకేష్‌ శంఖారావానికి స్పందన కరువు

- - Sakshi

శ్రీకాకుళం, సాక్షి ప్రతినిధి: టీడీపీ శంఖారావం కాస్తా నిరాశారావమైపోయింది. పస లేని విమర్శలు, పదును లేని ప్రసంగాలు, అర్థంపర్థం లేని బెదిరింపులతో లోకేష్‌ యాత్ర జిల్లాలో అభాసుపాలైంది. ఇదివరకు ఆయనే 400 రోజులు పాదయాత్ర అంటూ ప్రకటించి జిల్లాలో మాత్రం అడుగు పెట్టలేదు. శంఖారావమైనా చేస్తున్నారులే అనుకుంటే.. ఈ కార్యక్రమాన్ని కూడా తుస్సుమనిపించారు. భారీ సెట్టింగులతో శంఖారావం సభలు ఏర్పాటు చేసినప్పటికీ జనాల్లో స్పందన కరువవ్వడంతో దాదాపుగా అన్ని చోట్ల అట్టర్‌ఫ్లాప్‌ షో అయ్యింది. ఇచ్ఛాపురంలో మొదలుకుని పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కలిలో కూడా కనీసంగా మూడు వేలకు మించి జనం కనిపించలేదంటే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఆశావహులను లోకేష్‌ కాస్తా మందలించినట్లుగా తెలుస్తోంది. ఇలా అయితే ఏం గెలుస్తామంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు.

పట్టించుకోని వైనం..
టీడీపీకి జవసత్వాలు నింపుతుందని ఆశించిన లోకేష్‌ శంఖారావం.. కీలక పరిస్థితులపై ఏ మాత్రం పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. అపాయింట్‌మెంట్‌ కోరిన నాయకులను కూడా లోకేష్‌ కలవకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జిల్లాలో కళింగకోమటి సంఘం ప్రతినిధులు తమ ప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు తమ సమస్యలను చెప్పుకునేందుకు వేచి చూసినప్పటికీ నిరాశే మిగిలింది. అలాగే పలువురు తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడంపై పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీలో టిక్కెట్టు ఆశిస్తున్న గొండు శంకర్‌ లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఆయన్ను కనీసం స్టేజి మీద మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై కూడా శంకర్‌ వర్గం మండిపడుతోంది.

వాపును బలుపుగా..
లోకేష్‌ శంఖారావం అట్టర్‌ఫ్లాప్‌ అయినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం అదంతా సూపర్‌ హిట్‌ అంటూ ప్రచారాలకు దిగుతున్నారు. పచ్చమీడియా వర్గాలతో అనుకూల ప్రచారాలు చేయిస్తున్నారు. వాపును బలుపుగా భావిస్తున్నారు. ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యేలు అచ్చెన్న, అశోక్‌తో పాటు మాజీలు కూన రవి, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, గౌతు శివాజీ, కలమట వెంకటరమణ తదితర నేతలంతా బయటకు చెప్పకపోయినా..లోలోపల అంతర్మథనం చెందుతున్నారు. అయితే లోకేష్‌ దగ్గర మార్కులు కొట్టేసేందుకు కొందరు నేతలు ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌మీడియాలో ఇదంతా బలమే అనేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అయితే ఏకంగా తన ప్రసంగాల్లోనే లోకేష్‌ను ఆకాశానికెత్తేయడంతో పెద్ద చర్చే సాగింది. జిల్లాకు గత పదేళ్లుగా తాను ఏం చేశానో చెప్పలేక వచ్చే ఎన్నికల్లో ఏదేదో చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఉద్దానం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ శాశ్వత పరిష్కారాలు చూపిస్తుంటే దానిపై విమర్శలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. లోకేష్‌ పర్యటనలో జన స్పందన తేలిపోవడంతో జోష్‌ లేని లోకేష్‌.. తీవ్ర నిరాశతోనే పొరుగు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

నిరాశలో జన సైనికులు
జిల్లాలో లోకేష్‌ శంఖారావం పేరిట పర్యటిస్తున్నాడని తెలిసి తెలుగు తమ్ముళ్లతో పాటు జనసైనికులు కూడా పొత్తు ధర్మం ప్రకారం ఉత్సాహంగా పాల్గొనే ప్రయత్నం చేశారు. ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వరకు జనసేన పార్టీ నేతలకు పెద్దగా ఎక్కడా పట్టించుకోకపోవడంతో జనసైనికులు పూర్తి నిరాశలో పడ్డారు. వేదికపై జనసేన తరఫున టిక్కెట్టు ఆశిస్తున్న ఇచ్ఛాపురం, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చెర్ల తదితర చోట్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఫ్లెక్సీలు వేయించి ఏర్పాట్లు చేయించిన వారికి నిరాశే మిగిలింది. కనీసం పొత్తు ధర్మాన్ని కూడా పాటించకపోవడంతో ఇలాంటివారితోనా మా పవన్‌ చేతులు కలిపాడంటూ నిట్టూర్పుతో వెనుదిరిగారు.

 

whatsapp channel

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top