టెక్కలి : పోర్టు ఆధారిత సంస్థలకు తమ పచ్చని పంట పొలాలు ఇచ్చేది లేదంటూ టెక్కలి మండలం తలగాం గ్రామంలో బుధవారం రైతులు నిరసన చేపట్టారు. ప్రస్తుతం మూలపేట పోర్టుకు అనుసంధానంగా ఉన్న రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరు మేరకు భూములు అవసరమనే ప్రచారం జరుగుతుండటంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు టెక్కలి, బన్నువాడ, అయోధ్యపురం, మోదుగువలస, తలగాం తదితర గ్రామా లకు చెందిన రైతులంతా తలగాంలో సమావే శం ఏర్పాటు చేశారు. పుష్కలంగా పంటలు పండుతున్న తమ భూములను పోర్టు ఆధారిత సంస్థలకు కట్టబెట్టేది లేదంటూ తీర్మానం చేశారు. ఈ విషయంలో బలవంతపు భూ సేకరణ చేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేసి భూముల సేకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత గ్రామాలకు చెందిన రైతులంతా కలిసి నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, బాధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల: మండలంలోని పొన్నాడ పంచాయతీ వెంకన్నగారిపేట వద్ద గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎచ్చెర్ల పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ అవతారం తెలిపారు. ఎస్‌ఐ జి.లక్ష్మణరావుకు వచ్చిన సమాచారం మేరకు డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణతో కలిసి వెళ్లి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిలో కలెక్టర్ ఆఫీస్ దరి సంతోషిమాత గుడివద్ద ఉండే గంట్లాన సూర్యతేజ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుండ మండలం పిట్రగూడ గ్రామానికి చెందిన బురిడి లైకోన్ (దేవ్), శ్రీకాకుళం దమ్మలవీధికి చెందిన కేశవ్ బాలు ఉన్నారు. వీరి స్కూటీ డిక్కీలో తనిఖీలు చేయగా రెండు గంజాయి ప్యాకెట్లు, కేశవ్ బాలు ప్యాంట్ జేబులో ఒక గంజాయి కవర్ లభించాయి. వీరిని పట్టుకున్నవారిని ఎస్పీ అభినందించారు.


