శ్రీకాకుళం నియోజకవర్గంలో
కీలక నేత టార్చర్
సెలవుపై వెళ్లిపోతున్న అధికారులు
ఓవైపు ఒత్తిళ్లు, మరోవైపు బూతు పురాణం
తీవ్ర మనస్థాపానికి గురవుతున్న
ఉద్యోగులు
సెలవుల బాట..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
●శ్రీకాకుళం కార్పొరేషన్‌లో మరో ఇంజనీరింగ్ అధికారి అవుట్. మున్సిపల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పి.కమలాకర్ కీలక నేత టార్చర్ భరించలేక సెలవు పెట్టేసినట్టు తెలిసింది. చెప్పిన పనులన్నీ చేయలేక చేతులెత్తేశారు. అడ్డగోలుగా బిల్లులు చెల్లించలేక తప్పుకుంటున్నారు. కీలక నేత నోటి దురుసును తట్టుకోలేక వెళ్లిపోవడమే మంచిదంటూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలు చూపించి సెలవు కోసం దరఖాస్తు చేశారు. అంతకుముందే వీఆర్ కోసం కూడా దరఖాస్తు చేశారు. ఎంతవేగంగా తనను వదిలేస్తే అంత మంచిదని కోరుకుంటున్నారు.
●గార తహసీల్దార్‌గా పనిచేస్తున్న చక్రవర్తి కూడా సెలవుపై వెళ్లిపోయారు. ఈయన కూడా కీలక నేత, అనుచరుల సతాయింపు భరించలేక సెలవు పెట్టేసి ఆఫీసుకు రావడం మానేశారు. అంపోలులో వివాదాస్పద భూములను పచ్చ నేతలకు రాసిచ్చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా అందరి మధ్య నోటికొచ్చినట్టు బూతులు తిట్టడంతో
మనస్థాపానికి గురై సెలవుపై వెళ్లిపోయినట్టు తెలిసింది.
శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలక నేత టార్చర్ భరించలేక అధికారులు భయపడుతున్నారు. చెప్పినట్టు చేయాలని, సూచించినట్టు బిల్లులు చేయాలని, ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని పీకమీద కత్తి మీద పెడుతుండటంతో హడలెత్తిపోతున్నారు. చర్యలు తీసుకోకపోతే కీలక నేత ఒత్తిడి.. చర్యలు తీసుకుంటే కోర్టుల నుంచి అక్షింతలు.. వెరసి ముందుకెళ్లితే నుయ్యి వెనక్కి వెళ్లితే గొయ్యి అన్న చందంగా అధికారుల పరిస్థితి తయారైంది. దీపం ఉండగా ఇళ్లు చక్క దిద్దుకోవాలన్న ఆలోచనతో సంపాదించడమే పనిగా పెట్టుకున్న సదరు కీలక నేత దాని కోసం అడ్డదారులు తొక్కుతూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు.
నోరు విప్పితే బూతులే..
ఆ కీలక నేత నోరు విప్పితే చాలు బూతులే వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా ఉద్యోగుల పైకే వచ్చేస్తూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఇలాగే, గతంలో ఓ జిల్లా అధికారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆయన తిరగబడ్డాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడంతో వ్యవహారం పెద్దదైపోతుందని రాజీ ధోరణికి వచ్చారు. ఆ తర్వాత కార్పొరేషన్‌లో దక్షిణామూర్తి అనే అధికారి కూడా కీలక నేత బూతులు భరించలేక వెళ్లిపోయారు.
తాజాగా మరో ఇద్దరు బాధితులు..
డయేరియాకు ముందు కమిషనర్‌గా వచ్చిన హనుమంతు కూర్మారావు సస్పెన్షన్ వెనక కూడా కీలక నేత హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. చేసిందంతా చేసి తిరిగి ఇంటికి వెళ్లి పరామర్శించి, తనకేమి సంబంధం లేదన్నట్టుగా కలరింగ్ ఇచ్చుకున్నారు. తాజాగా మున్సిపల్ ఇంజనీర్ కమలాకర్ కూడా ఈయన బాధితుడయ్యారని అంటున్నారు. సతాయింపుతో పాటు అడ్డగోలుగా బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో రిటైర్‌మెంట్ దగ్గరకు వచ్చే వేళ తప్పు చేస్తే తనకు రావాల్సిన బెనిఫిట్స్‌కు గండి పడుతుందన్న ఉద్దేశంతో ముందస్తు అప్రమత్తతతో సెలవుపై వెళ్లేందుకు దరఖాస్తు పెట్టుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఈయన్నే కాదు కార్పొరేషన్ పనిచేస్తున్న అనేక మంది అధికారులను కీలక నేత నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా బూతు పురాణం విప్పుతున్నట్టు ఎప్పటి నుంచో విన్పిస్తోంది. గార తహసీల్దార్‌గా పనిచేస్తున్న చక్రవర్తి కూడా ఈయన బూతులు తట్టుకోలేక సెలవుపై వెళ్లిపోయినట్టు తెలిసింది. అంపోలులో ఉన్న వివాదాస్పద భూములను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టాలని ఒత్తిడి చేయడంతో పాటు స్థానికంగా సహకరించడం లేదని ఓ రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను సతాయించినట్టు తెలిసింది. కీలక నేత అనుచరులు ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సదరు అధికారిపై వీరంగం సృష్టించినట్టు సమాచారం. కీలక నేత హుకుం జారీ చేయడమే కాకుండా తాను చెప్పినట్టు వినలేదని అందరి మధ్య సదరు తహశీల్దార్‌పై నోరు పారేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అన్నింటా అదే తీరు..
మున్సిపల్ కార్పొరేషన్, రిమ్స్, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలతో పాటు ఇతర కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులపైన సదరు కీలక నేత జులుం ప్రదర్శిస్తున్నారు. కొందరు అధికారులు జీ హుజూర్ అంటుండగా.. తమకు ఎప్పటికై నా ముప్పు తప్పదనే వారు సెలవుపై వెళ్లిపోతున్నారు.
జిల్లా పౌరసరఫరాల అధికారులు సైతం ఇదే రకమైన సతాయింపునకు గురవుతున్నారు. కీలక నేత మాటలు తట్టుకోలేక, ఆయన చెప్పినదల్లా చేయలేక ఎంత వేగంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలా? అని చూస్తున్నారు. గ్రామాల్లో ఉన్న రేషన్ డీలర్లను తీసేయమని, సస్పెండ్ చేయమని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఆ నేత చెప్పినట్టు చర్యలు తీసుకుంటే సదరు డీలర్లు హైకోర్టుకు వెళ్లి అనుకూల ఆర్డర్లు తెచ్చుకోవడంతో తప్పని పరిస్థితుల్లో చర్యలు ఉపసంహరించుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దానికి కారణం అధికారులే అంటూ ఒంటికాలిపై లేచి వారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు సమాచారం.


