టెక్కలి సబ్‌కలెక్టర్ నూరుల్ కమర్ కారుకు అడ్డంగా కూర్చుని ధర్నాకు దిగిన దృశ్యం
కోటబొమ్మాళి: కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలస సర్పంచ్ సుంకరి జనార్ధన ఆధ్వర్యంలో పలువురు జగనన్న ఇళ్ల లబ్ధిదారులు మంగళవారం టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ కారును అడ్డగించి నిరసనకు దిగారు. తహసీల్దార్ జామి ఈశ్వరమ్మ తమ విన్నపాలను పట్టించుకోవడం లేదని, టీడీపీ మద్దతుదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ 2019లో అక్కయ్యవలసలో 25 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. ఈ మేరకు గ్రామంలోని సర్వేనంబర్ 19లో లే అవుట్ వేశారు. అయితే అప్పటికే అది ఆక్రమిత ప్రాంతం కావడంతో కొందరు ఇల్లు కూడా కట్టుకున్నారు. అక్కడే కొత్తగా పట్టాలు ఇస్తుండడంతో కొందరు టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి నుంచి పట్టాల పంపిణీ నిలిచిపోయింది. అప్పటి నుంచి స్థానికులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఫలితం లేకపోయింది. ఇటీవల పలాస పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి సమస్య తీసుకెళ్లడంతో.. సబ్‌కలెక్టర్ నూరుల్ కమర్ విచారణ కోసం అక్కయ్యవలస వెళ్లారు. లే అవుట్‌ను వేరే చోటకు మారుస్తామని చెప్పడంతో ఆగ్రహించిన లబ్ధిదారులు ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ జామి ఈశ్వరమ్మను వివరణ కోరగా లేఅవుట్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే పట్టాలు ఇవ్వలేదని, సబ్ కలెక్టర్ ఆదేశాలమేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే నిరసనకారులు ఎంతకూ శాంతించకపోవడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.


