చోరీకి గురైన బంగారు ఆభరణాలను విలేకరులకు చూపుతున్న పోలీసులు
నరసన్నపేట: మండలం కంబకాయలోని పాగోటి సావిత్రి ఇంటిలో ఆదివారం జరిగిన చోరీ కేసును నరసన్నపేట పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలతో పాటు నగదును కూడా రికవరీ చేశారు. ఐటీఐ చదివి నరసన్నపేటలో జి కమ్యూనికేషన్ ఫైబర్ నెట్‌లో పనిచేస్తున్న తర్ర జానకిరావు (ఫిర్యాదు దారు చెల్లి కుమారుడు)ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ బూర ప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ఆదివారం వేకువజామున చోరీ జరిగినట్లు సావిత్రి కుమారుడు రమేష్ ఫోన్‌లో సమాచారం ఇచ్చారని, వెంటనే స్పందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించామన్నారు.
సంఘటన పరిశీలన తర్వాత కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాలు, చోరీ జరిగిన తీరు ఆధారంగా ఇంటిలోనే ఉన్న వ్యక్తులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావించి ఆ దిశగా దర్యాప్తు చేశామని సీఐ తెలిపారు. శనివారం రాత్రి 11 గంటల వరకూ చోరీ జరిగిన గదిలో కుటుంబ సభ్యులు ఉన్నారని, మళ్లీ ఆదివారం వేకువజామున 2 గంటల సమయంలో సావిత్రి చూస్తే బీరువా తెరిచి ఉండటం లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలు కనిపించక పోవడాన్ని గమనించి ఇంట్లో వ్యక్తుల పనే అని భావించామన్నారు. వేలిముద్రలను సేకరించామని, డీఎస్పీ బాలచంద్రా
రెడ్డి ఆదేశాలతో కుటుంబ సభ్యులను విచారణ చేయగా తర్ర జానకీరాంపై అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తే అతను నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన జానకిరామ్ తల్లి మృతి చెందగా పెద్దమ్మ వద్దే ఉండి ఐటీఐ చదువుకున్నాడు. సొంత షాపు పెట్టుకోవడానికి పెట్టుబడి కోసం ఈ ఆభరణాలు దొంగతనం చేశానని అతను అంగీకరించాడని సీఐ తెలిపారు.
చోరీకి గురైన పదకొండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 15 వేల నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. కేసులో నరసన్నపేట ఎస్‌ఐ సింహాచలంతో పాటు సర్కిల్ ప్రత్యేక నిఘా సిబ్బంది ఏఎస్‌ఐ మస్తాన్, కానిస్టేబుల్ శ్రీనివాస్, నరసన్నపేట ఏఎస్‌ఐ అశిరినాయుడు, సీసీఎఫ్ ఎస్‌ఐ రఫూల్‌లు చురుకైన పాత్ర పోషించి చోరీ సొత్తును రెండు రోజుల్లో రికవరీ చేశామన్నారు.


