కణేకల్లు: ఓవైపు వర్షాభావం.. మరోవైపు కరువు కరాళ నృత్యం...దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న సమయంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హనకనహళ్ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామానికి నలుదిక్కులా ఉన్న వంకలు ఒక్కసారిగా వరదనీటి ఉధృతికి పొంగిపొర్లాయి. గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టడంతో రాకపోకలు స్తంభించి.. జనం బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. మిగిలిన సీజన్లలో ఊరంతా బాగానే ఉంటున్నా ... వర్షాకాలం వచ్చిందంటే ఆ ఊరి జనానికి ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆందోళన వెంటాడడం పరిపాటిగా మారింది.
కణేకల్లు మండలంలోని హనకనహళ్ గ్రామస్తులు వర్షాకాలంలో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రానికి హనకనహళ్ సుదూర గ్రామం. కణేకల్లుకు 18 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉంటుంది. అయితే బెళుగుప్ప మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం చుట్టూ వంకలు ఉన్నాయి. హనకనహళ్ నుంచి సొల్లాపురానికి వెళ్లే మార్గంలో ఊరికి దగ్గరలో సుమారు 200 మీటర్ల దూరంలో చిన్న వంక ఉంది. ఈ వంకకు మరో 500 మీటర్ల దూరంలో చెరువు వంక ఉంది. హనకనహళ్ నుంచి బెళుగుప్ప కు వెళ్లే దారిలో గ్రామ శివారులో పెద్ద వంక ఉంది. హనకనహళ్ చుట్టుపక్కల ఉన్న బెలుగుప్ప మండలానికి చెందిన తగ్గుపర్తి, రాంసాగరం, గంగవరం, బెళుగుప్ప తదితర ప్రాంతాల్లో వర్షాలొస్తే మూడు వంకల్లో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం రాత్రి హనకనహళ్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షానికి వంగలు, వాగులు పొంగిపొర్లాయి. దీంతో ఈ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉరవకొండ నుంచి హనకనహళ్ మీదుగా కళ్యాణదుర్గానికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఉదయం చెరువు వంక దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. వంక ఉధృతి తగ్గే దాకా రాకపోకలు పునరుద్ధరణ ఉండదు.
బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న రోజులెన్నో..
సొల్లాపురం వెళ్లే మార్గంలో రెండు వంకలు, బెళుగుప్ప మార్గంలో పెద్ద వంకలపై బ్రిడ్జిలు నిర్మించాలంటూ అనేకసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు కోరినా ఎవ్వరూ కరుణించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాన్పులు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్లలేని దయనీయ పరిస్థితి ఉంది. బెళుగుప్ప మార్గంలో ఒకే ఒక వంక ఉందని,ఈ వంకౖపైనెనా బ్రిడ్జి నిర్మిస్తే బెళుగుప్ప వెళ్లొచ్చని, అటు నుంచి జిల్లా కేంద్రమైన అనంతపురం వెళ్లొచ్చని ప్రజలు చెప్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వంకలు పారితే ఎటూ వెళ్లలేక దేవుడిపై భారం వేసి గడిపిన రోజులెన్నో ఉన్నాయని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
వంకలు పారితే స్కూళ్లకు సెలవే..
వంకలు పారితే పాఠశాలలు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య ఉపకేంద్రాల్లో పని చేసే ఉద్యోగులు గ్రామంలోకి చేరుకోలేరు. పాఠశాలలకు వెళ్లాల్సిన ఉపాధ్యాయులు అనంతపురం నుంచి హనకనహళ్‌కు అద్దె జీపుల్లో రోజూ వచ్చి వెళ్తుంటారు. ఉదయం విధులకు రావడం.. సాయంత్రం ఇళ్లకు వెళ్లడం పరిపాటి. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలతోపాటు హైస్కూల్ కూడా ఉంది. వంకలొస్తే స్కూల్‌కు కూడా హాలిడేనే. సచివాలయ, ఆరోగ్య ఉపకేంద్రాల్లో పని చేసే ఉద్యోగుల పరిస్థితి కూడా అంతే.
గ్రామాన్ని చుట్టుముట్టిన వరదనీరు
భారీ వర్షంతో పొంగిపొర్లుతున్న వంకలు
స్తంభించిన రాకపోకలు
వానొచ్చిందంటే ఓ వైపు ఆనందం..
మరోవైపు ఆందోళన
దయనీయ స్థితిని గడుపుతున్న గ్రామస్తులు


