బత్తలపల్లి: బత్తలపల్లి టోల్‌ఫ్లాజా సమీపంలో అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై ఆదివారం త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ధర్మవరం వాసులు పులివెందులలో ఆదివారం బంధువుల ఇంట జరుగుతున్న కేశఖండన కార్యక్రమానికి వెళ్తుండగా కారు టైరు పగిలి అదుపుతప్పి రోడ్డుపక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన మేరకు.. ధర్మవరం పట్టణానికి చెందిన నాగలక్ష్మి ధర్మవరం కోర్టులో పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు శ్రీకాంత్, కోడలు మౌనిక, అవ్వ బయమ్మలు నలుగురు పులివెందులలో ఆదివారం బంధువుల ఇంట్లో జరిగిన కేశ ఖండన కార్యక్రమానికి కారులో బయల్దేరారు. కారు ధర్మవరం నుంచి బత్తలపల్లి టోల్‌ఫ్లాజా సమీపంలోకి వెళ్లగానే కారు టైర్ పగిలి అదుపుతప్పి రోడ్డు పక్కన వ్యవసాయ తోట వద్దనున్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మౌనికకు తప్పా మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆర్డీటీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. వీరిలో నాగలక్ష్మి, బయమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు ఆరాతీశారు. ఇదిలా ఉండగా కారు టైరు పగిలిన సమయంలో వెనుక ఏదైనా వాహనాలు వస్తున్నా, ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెను ఢీ కొన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు. గాయాలతో బయటపడడంతో త్రుటిలో ప్రమాదం తప్పిందన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ధర్మవరానికి చెందిన పలువురు లాయర్లు, ఇతర సిబ్బంది ప్రమాదంపై, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
కారు టైరు పగిలి ఇద్దరికి తీవ్ర గాయాలు
కేశఖండన కార్యక్రమానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం


