పుట్టపర్తి: ‘‘అబద్ధాలతో వాళ్లు రెండేళ్లు గడిపేశారు. సంక్షేమ పథకాలు అందక జనం అల్లాడిపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారు. చివరకు సాగునీరులేక పంటలన్నీ ఎండిపోయి రైతులు అల్లాడిపోతున్నా...పట్టించుకునేవారే లేరు..ఈ అరాచక పాలనకు అంతం పలికి మళ్లీ జగనన్న రాజ్యం తెచ్చుకునేందుకు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా సైనికుల్లా పని చేసి విజయఢంకా మోగించాలి’’ అంటూ పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పుట్టపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో పాటు వివిధ అనుబంధ, విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ...గత వైఎస్సార్ సీపీ హయాంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రజలపై భారం మోపిందన్నారు. అలాగే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, మద్దతుదారులపై అక్రమ కేసులు, ఆస్తులు ధ్వంసం చేస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
వైఎస్సార్‌సీపీ హయాంలోనే అభివృద్ధి..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పుట్టపర్తిని జిల్లా చేయటంతో పాటు వేలాది మందికి జగనన్న ఇళ్లు కట్టించామని, రెండు జాతీయ రహదారులు, ఒక గ్రీన్‌ఫీల్డు హైవే పనులు చేపట్టామన్నారు. వీటి వల్లే పరిశ్రమలు వస్తున్నాయన్నారు. దీంతో పాటు రూ.864 కోట్లతో నియోజకవర్గంలో 193 చెరువులు నింపే పనులకు శ్రీకారం చుట్టామన్నారు. వీటిని పూర్తి చేయటంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి విఫలమయ్యారన్నారు. జూదరులను ప్రోత్సహించి ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రతిష్టను మంట కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె రఘునాథరెడ్డి ప్రోత్సాహంతో తెలుగు తమ్ముళ్లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ నదుల రూపురేఖలు మార్చేశారన్నారు. చివరకు తాగునీటి పైపులు అమ్ముకొని దోపీడీ చేశారని ఆరోపించారు.
50 ఏళ్లకే పింఛన్ ఏమైంది బాబూ
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని వారికి 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ కథ ఇప్పుడు కంచికి చేరిందని శ్రీధర్‌రెడ్డి అన్నారు. 60 ఏళ్ల వయస్సు ఉన్న వారికి సైతం నేటికీ పింఛన్ ఇవ్వలేదని విమర్శించారు. అలాగే పింఛన్లలోనూ భారీగా కోత పెట్టారన్నారు. ఇతర సంక్షేమ పథకాలు కూడా అర్హులకు రద్దు చేసి కేవలం తమ పార్టీ వారికే అందిస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు.
మోసాల మాంత్రికుడు చంద్రబాబు
చంద్రబాబు మోసాల మాంత్రికుడని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేశ్‌రెడ్డి అన్నారు. అధికారం కోసం ఆయన ఎంతకై నా దిగజారుతారన్నారు. నమ్మిన వారిని దారుణంగా మోసం చేయటం చంద్రబాబుకు అలవాటన్నారు. అందుకే నమ్మి ఓటేసిన వారిని నట్టేట ముంచారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి స్థానిక సంస్థల్లో గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి
మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి,
పార్లమెంట్ పరిశీలకుడు
రమేశ్‌రెడ్డి పిలుపు
పుట్టపర్తి నియోజక వర్గ
విస్తృత స్థాయి సమావేశం
భారీగా హాజరైన
పార్టీ నాయకులు, కార్యకర్తలు


