● దేశభక్తిని చాటిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ
పుట్టపర్తి టౌన్: మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. దేశభక్తితో అందరి హృదయం ఉప్పొంగింది. ‘వందేమాతరం, భారత్ మాతాకీ జై’ నినాదాలతో పుట్టపర్తి పరవశించింది. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ గురువారం పుట్టపర్తిలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ ఘనంగా సాగింది. పట్టణంలోని సత్యమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉత్సాహంగా సాగింది. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ ర్యాలీని ప్రారంభించడంతో పాటు విద్యార్థులతో కలిసి ముందుకుసాగారు. అనంతరం జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ దేశ సమగ్రతకు కట్టుబడి ఉంటామని ‘హర్ ఘర్ తిరంగా’ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ జెండా పట్ల గౌరవం, జాతీయ ఐక్యత, దేశ సమగ్రతపై ప్రజల్లో అవగహన పెంపొందించడమే లక్ష్యంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజాబేగం, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీఆర్‌డీఏ పీడీ నరసయ్యతోపాటు పలుశాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, చిన్నారులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మానవహారంగా ఏర్పడి దేశభక్తి
నినాదాలు చేస్తున్న
విద్యార్థులు, ప్రజలు


