ప్రశాంతి నిలయం: బ్యాంకర్లు, జిల్లా యంత్రాంగం పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను వంద శాతం సాధించాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో 2026–27 వార్షిక సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ , జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ఆధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని బ్యాంకింగ్ సేవల ప్రగతి, వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్, పీఎంఎఫ్‌ఎంఈ వంటి ప్రాధాన్యత పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికారులు, బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల శాతాన్ని తగ్గించడానికి డీఆర్‌డీఏ, మెప్మా, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి బ్యాంకర్లకు తగిన సహకారం అందించాలని సూచించారు. పొదుపు సంఘాల ఎన్‌పీఏ తగ్గించేందుకు ఆయా సంఘాల లీడర్లు, యూనియన్లు, సీసీలు బ్యాంకర్లకు సహకరించాలన్నారు. అంతేకాకుండా సకాలంలో రుణాలు మంజూరు చేయడంతో పాటు బ్యాంకింగ్ డిపాజిట్లను కూడా వేగవంతంగా సమీకరించాలని ఆధికారులను ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఫణీంద్ర కుమార్, ఆర్‌బీఐ ఎల్‌డీఓ రవీంద్రబాబు, ఏపీజీబీ ఆర్‌ఎం ప్రహ్లాద్‌రావు, కెనరా బ్యాంకు, ఎస్‌బీఐ ప్రతినిధులు, పలు బ్యాంక్‌ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డీఎల్‌ఆర్‌సీలో కలెక్టర్ శ్యాం ప్రసాద్


