ఎన్‌పీ కుంట: సోలార్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయే ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగనివ్వబోమని వైఎస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ భరోసా ఇచ్చారు. గురువారం ఆయన మండల పరిధిలోని మరికొమ్మదిన్నె పంచాయతీ జౌకల గ్రామంలో పర్యటించారు. సోలార్ ప్లాంట్ పనులు అడ్డుకున్నారన్న నెపంతో ప్రభుత్వం కేసులు పెట్టిన 11 మంది రైతుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. రైతు కుటుంబీకులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడేమో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు మక్బూల్ దృష్టికి తీసుకువచ్చారు. తమ సాగు భూములకు సంబంధించి డివిజన్, పరిశీలన ప్రక్రియ పూర్తయినప్పటికీ సంబంధిత పత్రాలు తమ చేతికి అందలేదని తెలిపారు. వ్యవసాయం తప్ప మరో పని తెలియని తమ నుంచి భూములు లాక్కుంటే రోడ్డున పడతామని వాపోయారు. పోలీసులు కూడా ఏకపక్షంగా సోలార్ కంపెనీ వాళ్లకు కొమ్ముకాస్తూ తమపై అక్రమంగా కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మక్బూల్ వారికి భరోసా కల్పించారు. సోలార్ ప్లాంట్ వల్ల ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వబోమన్నారు. రైతుల ప్రమేయం లేకుండా వారి సాగుభూములను సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు లాక్కోవడం అన్యాయమన్నారు. సోలార్ ప్లాంట్ భూములు అవసరమైతే ముందు గ్రామ సభ నిర్వహించి, రైతుల సమ్మతితో భూసేకరణ చేపట్టాలన్నారు. దౌర్జన్యంగా భూసేకరణ చేయడంతో పాటు తమ భూముల కోసం పోరాడుతున్న రైతులపై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. రైతుల సమస్యలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన స్పందించి వారికి అండగా నిలవాలని ఆదేశించారన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. అన్ని విధాలా రైతులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించి, భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కొత్త రంగారెడ్డి, ఎంపీటీసీ తిమ్మారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, తిరుమల నాయుడు, వెంకటేశ్వర్లు, దుద్దుకుంట వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటరామిరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు రెడ్డప్ప, సోమిరెడ్డి, అంజన్‌రెడ్డి, రామచంద్ర, చెన్నకృష్ణారెడ్డి, ఖాదర్‌వలి, రాఘవరెడ్డి, మౌలా, శ్రీహరినాయుడు, బావాజీ, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కదిరి సమన్వయకర్త
మక్బూల్ అహ్మద్
సోలార్ ప్లాంట్ బాధిత రైతు కుటుంబాలకు
పరామర్శ
అధైర్య పడకండి, అండగా ఉంటామని భరోసా
అక్రమ కేసులు బనాయించిన
ప్రభుత్వంపై ఆగ్రహం


