‘నేతన్న సేవలో’ పథకం అనర్హులకు దక్కడంతో నేతన్నల్లో ఆగ్రహం పెల్లుబుకింది. మగ్గాలే లేని పల్లెల్లోని కూటమి పార్టీల మద్దతుదారులకు పథకం వర్తించడంతో అర్హులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ధర్మవరం పట్టణంలోని కదిరిగేట్ వద్ద ఉన్న నేతన్న విగ్రహం వద్ద వందలాది మంది చేనేత కార్మికులు రోడ్డుపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. చేనేత రంగం పీకల్లోతు సంక్షోభంలో ఉంటే తమ కష్టంతో వ్యాపారం చేసి సగం సగం పంచుకుంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పట్టణంలోని సచివాలయాలను ముట్టడించారు. చేనేత జౌళిశాఖ అధికారులను ఘొరావ్ చేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ప్రభుత్వం డైలమాలో పడింది. మళ్లీ అర్హులకు నిధులు జమ చేస్తామంటూ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ రెండో జాబితాలోనైనా అర్హులకు న్యాయం జరుగుతుందా..? అవినీతికి పాల్పడ్డ కూటమి నాయకులపై చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని కాపాడే సాహసం ప్రభుత్వం చేస్తుందా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.


