పెనుకొండ రూరల్ (సోమందేపల్లి): ‘అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న సేవలో పథకం కింద లబ్ధి చేకూర్చాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించం..అధికార పార్టీ నాయకులు తమ కార్యకర్తలు, అనుయాయులకు పథకం కట్టబెట్టి నిజమైన చేనేత కార్మికులకు అన్యాయం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హులకు ‘నేతన్న సేవ’ వర్తింపజేయాలి. లేకపోతే పోరాటం ఉధృతం చేస్తాం’’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. అర్హులైన చేనేత కార్మికులకు ‘నేతన్న సేవలో’ పథకం వర్తింపజేయకపోవడంతో శుక్రవారం బాధితులతో కలిసి సోమందేపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.. చేనేతల సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం...రెండేళ్ల ఆర్థిక లబ్ధిని ఎగ్గొట్టిందన్నారు. ఇప్పుడు ‘నేతన్న సేవలో’ అంటూ ఆర్థికసాయం చేసినా అధికార పార్టీ మద్దతుదారులకే దక్కిందన్నారు. దీంతో అర్హులైన వేలాది మంది చేనేత కార్మికులు పథకానికి దూరమయ్యారన్నారు. చేనేతలకు అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జౌళిశాఖ మంత్రి సవిత నియోజకవర్గంలోనే పథకం పారదర్శకంగా అమలు కాకపోవడం చూస్తే మిగతా ప్రాంతాల్లో అర్హుల జాబితా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లాలో మగ్గాలే లేని గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలకు చేనేత పథకం అందించి నిజమైన కార్మికుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి ‘నేతన్న సేవలో’ పథకం లబ్ధిదారుల జాబితాను మరోసారి పరిశీలించడంతో పాటు పథకం అందని నిజమైన అర్హులకు న్యాయం చేయాలన్నారు.
నేతన్నల నేస్తం జగనన్నే
చేనేతల కష్టాలు చూసి చలించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ‘నేతన్న నేస్తం’ ప్రవేశపెట్టి అర్హులందరికీ ఆర్థిక సాయం అందించారని ఉషశ్రీచరణ్ గుర్తుచేశారు. అర్హతే ప్రామాణికంగా పథకం అమలు చేశామన్నారు. ప్రతి లబ్ధిదారుడుకి నివాసానికి వెళ్లి జియో ట్యాగింగ్ చేశామన్నారు. పథకానికి అర్హులు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఎవరి సిఫార్సు అవసరం లేకుండానే ఆర్థిక సాయం మంజూరైందన్నారు. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా కేవలం అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే పథకం వర్తిస్తోందన్నారు.
‘నేతన్న సేవ’ను అధికార పార్టీ నేతలు
దోపిడీకి తోవగా మార్చారు
వేలాది మంది అర్హులకు పథకం అందకుండా కుట్ర చేశారు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజం
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట చేనేతలతో కలిసి ధర్నా
అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్
బీసీలపై
అక్రమ కేసులు
ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఉషశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి కేసు విషయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారన్నారు. ఎమ్మెల్యే విరుపాక్షిని జైలులో పెట్టారన్నారు. అక్రమ కేసులు పెట్టడం వైఎస్సార్‌సీపీ నాయకులను వేధించడం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారన్నారు. చంద్రబాబు సర్కార్ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే, ప్రజల హక్కులను కాపాడేందుకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోందన్నారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా న్యాయంగా బద్ధంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు.


