● రఘువీరా ప్రకటన
పరిగి: ‘ఇటీవలే కుటుంబ సభ్యులమంతా కూర్చొని మాట్లాడుకున్నాం. మా భార్యాభర్తల్లో ఎవరు ముందుగా కాలమైనా పార్థివదేహాన్ని పూడ్చకుండా మెడికల్ కాలేజీకి అప్పగించాలని నిర్ణయించుకున్నామ’ని మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. మండలంలోని సేవామందిరంలో శుక్రవారం ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య ఆసుపత్రి, సేవా ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘చౌడమ్మ ఉచిత ప్రాథమిక కంటి వైద్య పరీక్ష కేంద్రం’ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా రఘువీరా మాట్లాడుతూ విద్యార్థులకు మేథాశక్తి పెంపొందించడానికి బొమ్మలు, కృత్రిమ దేహాలతో చేసే ప్రయోగాలతో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చన్నారు. కనీసం తన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇస్తే వైద్య విద్యార్థులు ప్రయోగాత్మకంగా జ్ఞానాన్ని పొంది ఉన్నతంగా వైద్య సేవలను అందించేందుకు వీలు కలుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సేవామందిరం సంస్థ అధ్యక్షుడు కేటీ శ్రీధర్, నాయకులు కొండూరు వేణుగోపాలరెడ్డి, డాక్టర్ అశ్వర్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేటీ తిప్పేస్వామి సతీమణి శాంతమ్మ, సునీత రఘువీర్, శాంత జయరామ్ దంపతులు, చెలువమూర్తి, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ నిరంజన్‌కుమార్, ఎంఈఓ శేషాచలం తదితరులు పాల్గొన్నారు.


