పుట్టపర్తి: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీన అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కిష్టప్ప సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జెడ్పీ, ఎంపీ, మున్సిపల్, ఏపీఎంఎస్, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఏపీటీడబ్ల్యూఐర్‌ఈఐఎస్, ఏపీఆర్‌ఈఐఎస్, డైట్, కేజీబీవీ తదితర పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న టీచర్లందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను రెండు సెట్లు జిరాక్స్ తీసి ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత ఎంఈఓ, డీవైఈఓ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి ఈనెల 27 సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. పదేళ్ల బోధనానుభవంతో పాటు గతంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకోని వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అలాగే వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు, క్రమశిక్షణా చర్యలు ఉండకూడదన్నారు.
జేఎన్‌టీయూ(ఏ)కు ఐఎస్‌ఓ సర్టిఫికెట్
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ దక్కింది. మొత్తం ఏడు అంశాల్లో ఐఎస్‌ఓ గుర్తింపు దక్కినట్లు హిమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఆలపాటి శివయ్య తెలిపారు. ఈ మేరకు జేఎన్‌టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ ఐఎస్‌ఓ సర్టిఫికెట్ అందించారు. మరిన్ని నాణ్యమైన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి తగు సూచనలను, సలహాలు ఇచ్చామన్నారు.
నకిలీ రూ.500 నోట్ల చలామణి.. ఇద్దరి అరెస్ట్
అగళి: నకిలీ రూ.500 నోట్లు ఇచ్చి ఓ కిరాణా దుకాణదారుడిని బురిడీ కొట్టించిన ఇద్దరిని శుక్రవారం అగళి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు శుక్రవారం మండల పరిధిలోని కార్పేపల్లి, నందరాజనపల్లి తదితర గ్రామాల్లో పర్యటించారు. రద్దీ ఎక్కువగా ఉండే కిరాణా దుకాణాల వద్దకు వెళ్లి రూ.20 నుంచి రూ.50లోపు వ్యాపారం చేసి రూ.500 నోటు ఇచ్చారు. చిల్లర ఇవ్వగానే అక్కడి నుంచి ఉడాయించారు. ఇలా నందరాజనపల్లి గ్రామంలోని ఓ కిరాణాషాపులోనూ సరుకులు కొనుగోలు చేసి నకిలీ రూ.500 నోటు ఇచ్చారు. అయితే వెంటనే గుర్తించిన దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన దుండగులు ద్విచక్రవాహంలో పారిపోతుండగా ఎస్‌ఐ రంగడు యాదవ్ వారి వెంబడించి ఇరిగేపల్లి పాత బిల్డింగ్ వద్ద పట్టుకున్నారు. అనంతరం స్టేషన్‌కు తరలించి విచారించగా వారు నేరం ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద నుంచి రూ.2.50 లక్షల విలువైన నకిలీ రూ..500 నోట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఈ–కేవైసీకి నేటితో ఆఖరు
ప్రశాంతి నిలయం: జిల్లాలోని గ్యాస్ వినియోగదారులంతా తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. వాస్తవానికి ఈ–కేవైసీకి 2026 జూలై 31 వరకూ కేంద్రం డెడ్‌లైన్ పెట్టినప్పటికీ, వినియోగదారులు పూర్తి స్థాయిలో ఈ–కేవైసీ చేసుకోకపోవడంతో ఆ గడువును ఆగస్టు 16వ తేదీ వరకు పొడిగించిందన్నారు. అయితే 16వ తేదీ ఆదివారం కావడంతో ఈ–కేవైసీకి నేటికీ గడువు ముగుస్తుందన్నారు. జిల్లాలో 52 వేల గ్యాస్ కనెక్షన్ల ఈ–కేవైసీ పూర్తి కాలేదని, వారంతా శనివారంలోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. లేకపోతే గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీ వంటి వాటికి ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వం అందించే గ్యాస్ సబ్సిడీ కూడా అందదన్నారు. అప్పుడు ఒక్కో సిలిండర్ రూ.2300 చొప్పున వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పరిస్థితి రాకుండా గడువులోపు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలన్నారు. గ్యాస్ ఏజెన్సీలతో పాటు మొబైల్ యాప్ ద్వారా ఇళ్ల వద్దే ఈ–కేవైసీ పూర్తి చేయవచ్చన్నారు.


