స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న చితంబరరెడ్డి | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న చితంబరరెడ్డి

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

పుట్టపర్తి అర్బన్‌: స్వాతంత్య్రోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు పుట్టపర్తి మండలం పెడపల్లికి చెందిన ఎగువవీధి చితంబరరెడ్డి. వందేమాతరం, పరదేశ వస్త్ర బహిష్కరణ ఉద్యమాల్లో చితంబరరెడ్డి.. అన్న నరసారెడ్డితో పాటు బెజవాడ గోపాలరెడ్డి, మరువూరు కోదండరామిరెడ్డి, యర్రంరెడ్డి బాలకృష్ణారెడ్డిలో కలిసి ఉద్యమాలు చేయడంతో మచిలీపట్నం జైలులో శిక్ష అనుభవించారు. 1928, 1929లో సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ ఉద్యమంలో భాగంగా బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లజెండాలు ఎగురవేశారు. 1930లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసైన తరువాత కల్లూరు సుబ్బారావు వెంట జిల్లా మొత్తం తిరుగుతూ ఉద్యమంలో పాల్గొన్నారు. 1941లో మహాత్మాగాంధీ ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు పెనుకొండలో ఆయన్ను అరెస్టు చేశారు. తిరుచిరాపల్లి జైలులో 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1942 ఆగస్టులో క్విట్‌ ఇండియా ఉద్యమంలో చేరి 1943 వరకూ అజ్ఙాతంలో పని చేశారు. 1955లో పెనుకొండ విధాన సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచారు. 1959లో అనంతపురం జిల్లా ప్రథమ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1960లో బలవంతరాయ్‌ మెహతా కమిషన్‌లో చైర్మన్‌గా పని చేశారు. జిల్లాలో కరువు సంబంవించినప్పుడు భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో కలిసి తిరిగారు. 1964, 1970ల్లో విధాన సభకు ఎన్నికయ్యారు. ఆయన సేవలకుగాను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తామ్ర పత్రాన్ని అందజేశారు. 2003 ఫిబ్రవరి 24న ఆయన కన్నుమూశారు.

ఆయన సూచనలు శిరోధార్యం

తండ్రిగా మాకు ఎన్నో సూచనలు చేశారు. వాటిని పాటిస్తూ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తున్నాం. తామ్ర పత్రం, ఫొటోలు, అప్పట్లో పింఛన్‌ కోసం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, ప్రభుత్వం ఇచ్చిన మెమొంటోలు ఇప్పటికీ గుర్తుగా జాగ్రత్తగా ఉంచుకున్నాం. ఆయన పంచిన మంచి తనమే మాకు జీవితంలో పూలదారి చూపుతోంది.

– ఏవీ రమణారెడ్డి, చితంబరరెడ్డి కుమారుడు, ఎంపీపీ, పుట్టపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement