● ఎస్పీ సతీష్‌కుమార్
పుట్టపర్తి టౌన్: దివ్యాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యమిస్తూ నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ సతీష్ కుమార్ 80 వినతులు స్వీకరించి ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు విన్న అనంతరం సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, సీఐ బొజ్జప్ప తదితరులు పాల్గొన్నారు.
కారు బోల్తా..
ఐదుగురికి తీవ్ర గాయాలు
చిలమత్తూరు: మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి వద్ద కారు బోల్తా పడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాయచోటి నుంచి బెంగళూరు వెళుతున్న కారు తిమ్మారెడ్డిపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. కారు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు హుటాహుటిన 108 ద్వారా హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కదిరికి చెందిన సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రాయచోటికి చెందిన రేణుక, సురేఖ, సోమశేఖర్, రవికుమార్‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
కారు ఢీకొని బిహార్ వాసి మృతి
గోరంట్ల: కారు ఢీకొని బిహార్ వాసి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని జీనవాండ్లపల్లి సమీపంలో జరిగింది. సీఐ బోయ శేఖర్ తెలిపిన మేరకు.. జీనవాండ్లపల్లి సమీపంలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల వద్ద సైట్ ఇంజినీర్‌గా బిహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంతకుమార్ పాండే (36) పనిచేస్తున్నాడు. సోమవారం తన ద్విచక్ర వాహనంలో బ్రిడ్జి వైపు వెళ్తున్న ఆయనను ఓ కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన ప్రశాంత కుమార్ పాండే అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఉన్నట్లు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పోలీసుల అదుపులో
హత్య కేసు నిందితుడు
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణం ఎరగుంటకు చెందిన బోయ దాసరి శ్రీనివాసులు హత్య కేసులో కీలక నిందితుడు గంగాధర్‌నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని చెరువులో ఆదివారం దాసరి శ్రీనివాసులు శవమై తేలాడు. మూడు రోజులుగా కనిపించకుండా పోయిన ఆయన చెరువులో శవమై తేలడంతో పోలీసులు పూర్తిగా విచారించి హత్య కేసుగా నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు సోమవారం పట్టణ శివారు ప్రాంతంలో మరో ప్రధాన నిందితుడు గంగాధర్‌నాయుడును అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో నేడో, రేపో అరెస్టు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాగులపాడు చేరుకున్న కృష్ణా జలాలు
వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం లిఫ్ట్ వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. ఈ నెల 5న కర్నూలు జిల్లా మల్యాల వద్ద నీటి పంపింగ్ ప్రారంభించగా, 9వ తేదీన అనంతపురం జిల్లాలోకి ప్రవేశించాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. మొదట ఒక పంపుతో నీటి పంపింగ్ ప్రారంభించిన అధికారులు నీటి ప్రవాహం పెరగడంతో ఆరు పంపులకు పెంచారు. ఈ క్రమంలో హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా జలాల రాకతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాగులపాడు లిఫ్ట్ నుంచి మొత్తం 1,900 క్యూసెక్కుల మేర నీరు పంపింగ్ అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హంద్రీ–నీవా ఈఈ శ్రీనివాస్‌నాయక్, ఏఈ సురేష్‌కుమార్‌నాయక్ కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నీటిని తాగు అవసరాలకు మాత్రమే వినియోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.


