ముందు హామీలు అమలు చేయండి | - | Sakshi
Sakshi News home page

ముందు హామీలు అమలు చేయండి

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

ధర్మవరం అర్బన్‌: శ్వేతపత్రం విడుదల చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలపై తప్పుడు లెక్కలు చెప్పడంపై ఉన్న శ్రద్ధ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు లేదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్‌లు ప్రశ్నించారు. పట్టణంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో సోమవారం యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫెడరేషన్‌ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూటీఎఫ్‌ ఆవిర్భావం నుంచి సమస్యల పరిష్కారంలో అలుపెరుగని పోరాటాలు చేస్తూ రీ గ్రూపింగ్‌ స్కేల్స్‌ సాధన, మెరుగైన ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, అప్రెంటిస్‌ విధానం రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ వంటి ప్రధాన సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించిందన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు బోధనేతర పనులతో సతమతమవుతున్నారని వాపోయారు. విద్యను ప్రైవేటీకరించడంలో భాగంగా పాఠశాలల మూసివేతకు ప్రభుత్వమే పరోక్షంగా కుట్ర పన్నుతున్నట్లుగా ఉందన్నారు. డీఏలు, పీఆర్‌సీ, సంపాదిత సెలవుల మంజూరు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, పీఎఫ్‌ సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకపోగా రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయులకే చెల్లిస్తున్నట్లు శ్వేత పత్రాలను విడుదల చేయడం సరికాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి శ్వేత పత్రం విడుదల చేయాలని, పీఆర్‌సీని వెంటనే నియమించి 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మెడలు వంచి అయినా న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి అమర్‌నారాయణరెడ్డి, నాయకులు ఆంజనేయులు, లతాదేవి, పట్టణ అధ్యక్షులు జింక హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి రామంజినేయులు, డివిజన్‌ నాయకులు వెంకటకిషోర్‌, ఆదిశేషు, పోసా సాయిగణేష్‌, నాగిరెడ్డి, రవిశేఖర్‌, ప్రదీప్‌కుమార్‌, హేమంత్‌, విశ్వనాథ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement