దీక్షాదక్షులు | - | Sakshi
Sakshi News home page

దీక్షాదక్షులు

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

10న నిరసన ర్యాలీలు

డీఎస్సీ నిమాయకాల్లో అర్హులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో సాగుతున్న దశలవారీ ఉద్యమం భాగంగా ఈ నెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాం. యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి. – ఉషశ్రీచరణ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

పుట్టపర్తి: డీఎస్సీ నియామాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షల్లో యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. దీక్షాదక్షులై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. శనివారం మూడోరోజు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, మడకశిర నియోజక వర్గాల్లోని పలు మండల కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టారు. వీరికి ఆయా నియోజక వర్గాల సమన్వయకర్తలు తోడ్పాటునందించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, యువతతో కలిసి దీక్షా శిబిరంలో కూర్చొని నిరసన తెలిపారు.

రిలే దీక్షలకు అన్ని వర్గాల మద్దతు..

పెనుకొండ నియోజక వర్గంలోని రొద్దం మేజర్‌ పంచాయతీలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌, హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో సమన్వయకర్త టీఎన్‌ దీపిక ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. మడకశిరలో ఏరియా ఆసుపత్రి వద్ద నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. కదిరిలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర యాక్టివిటీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, పార్లమెంట్‌ పరిశీలకులు రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగించారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మవరంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని దీక్షలు నిర్వహించారు. ముస్లింలు దీక్షా శిబిరం వద్ద ప్రత్యేక సమాజ్‌ చేశారు. అన్యాయంపై పోరుబాట పట్టిన వైఎస్సార్‌సీపీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.

న్యాయం జరిగే వరకూ పోరాడతాం..

డీఎస్సీ నియామకాల్లో అన్యాయానికి గురైన అర్హులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు దీపిక, ఈరలక్కప్ప, నాయకులు వజ్ర భాస్కర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి తదితరులు తెలిపారు. దీక్ష శిబిరాల వద్ద వారు మాట్లాడారు. డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవతవకలపై నిష్పక్షపాతంగా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

డిఎస్సీ ఫలితాలు విడుదలయ్యాక మెరిట్‌ జాబితాను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్‌ కోటాలో బేరసారాలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు మంత్రి లోకేష్‌ బాధ్యత వహిస్తూ వెంటనే పదవికి రాజీనామా చేయాలన్నారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడడం దారుణమన్నారు. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకొని తక్షణమే పరిష్కరించాలన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదన్నారు.

ఎన్నికల హామీలు అమలు చేయాలి..

ఎన్నికల సమయంలో విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో కూటమి ప్రభుత్వం విఫలమైందని నేతలు ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని, లేనిపక్షంలో ఎన్నికల హామీ మేరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేయాలన్నారు. ఉన్నత విద్యకు అందించే వసతి దీవెన, విద్యాదీవెన పథకాలకు కింద ఇప్పటి వరకూ ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.

అర్హులకు న్యాయం చేసి అక్రమార్కులకు అరదండాలు వేయాలంటూ నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు దీక్ష పూనారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలేదీక్షలకు స్వచ్ఛందంగా

సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికై నా ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్‌సీపీ తోడుగా పోరాటం ఉధృతం చేసి జెన్‌జీ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.

డీఎస్సీ అక్రమాలపై మూడోరోజు

కొనసాగిన వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు

స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటించిన విద్యార్థులు, నిరుద్యోగులు

క్రీడల కోటా పేరుతో జరిగిన

అక్రమాలపై నిగ్గు తేల్చాలి

విద్యాశాఖను భ్రష్టుపట్టించిన మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

అర్హులకు న్యాయం చేయకపోతే

జెన్‌జీ సత్తా చూపుతామని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement