ఎల్లారుమ్‌ నల్లా ఇరుక్కాంగ! | - | Sakshi
Sakshi News home page

ఎల్లారుమ్‌ నల్లా ఇరుక్కాంగ!

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

హిందూపురం: ‘‘ఎన్నమా...ఎల్లారుమ్‌ నల్లా ఇరుక్కాంగ’’ అంటూ ఎస్పీ సతీష్‌కుమార్‌ తమిళంలో మాట్లాడటంతో స్థానిక పళనినగర్‌లోని తమిళులంతా ఆనంద పడ్డారు. ఎస్పీది కూడా తమిళనాడే అని తెలుసుకుని ఆయన వద్దకు వచ్చి ఆత్మీయంగా మాట్లాడారు. శనివారం సాయంత్రం ఎస్పీ సతీష్‌కుమార్‌ అడిషనల్‌ ఎస్పీ కేవీ మహేష్‌తో కలిసి హిందూపురంలోని పళనీనగర్‌, ఇంద్రనగర్‌కాలనీల్లో పర్యటించారు. ఆయా కాలనీల్లోని తమిళులతో మాట్లాడారు. తమిళంలోనే ఆప్యాయంగా పలకరిస్తూ ‘ఎల్లారుమ్‌ నల్లా ఇరుక్కాంగ’ (అందరూ బాగున్నారా) అంటూ వారి జీవన పరిస్థితులు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలుంటే తనకు చెబితే పరిష్కరానికి కృషి చేస్తానన్నారు. కాలనీ వాసులతో కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు ఇతర ఇబ్బందులపై ఆరా తీశారు. ఆకతాయిలు వేధిస్తున్నారా, రాత్రివేళల్లో మద్యం సేవించి ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తున్నారా..? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించేలా చూసేందుకు పోలీస్‌ శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే స్థానిక పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, లేకపోతే నేరుగా తనకే తెలియజేయవచ్చన్నారు.

గణేష్‌ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సాగాలి

గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా వాతావరణంలో, సోదరభావంతో జరుపుకుందామని ఎస్పీ సతీష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం హిందూపురంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గణేష్‌ వేడుకల నిర్వహణపై మంటపాల నిర్వాహకులు, పురప్రముఖలతో ఆయన సమావేశమయ్యారు. పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలను వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ...గణేష్‌ వేడుకలను ప్రజలందరూ కలిసికట్టుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. గొడవలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐలు అబ్దుల్‌ కరీం, రాజగోపాల్‌ నాయుడు, జనార్దన్‌, ఆంజనేయులు, ఎస్‌ఐలు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

హిందూపురం పళనీనగర్‌,

ఇంద్రనగర్‌ కాలనీల్లో ఎస్పీ పర్యటన

కాలనీలో ఉంటున్న తమిళులతో తమిళంలో మాటామంతీ

గణేష్‌ ఉత్సవాల నిర్వహణపై

నిర్వాహకులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement