కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): ‘తాకట్టుపెట్టిన బంగారానికి పూర్తి బాధ్యత సంస్థదే. సిబ్బంది గోల్‌మాల్ చేస్తే రికవరీ చేసి ఖాతాదారులకు ఇవ్వాల్సిన బాధ్యత సంస్థదే’ అని రామగిరి సీఐ మహమ్మద్ అలీ తేల్చిచెప్పారు. చెన్నేకొత్తపల్లిలోని కీర్తన గోల్డ్‌లోన్ సంస్థలో బంగారం తాకట్టు పెట్టి మోసపోయిన ప్రతి ఖాతాదానికి బ్యాంకు యాజమాన్యమే న్యాయం చేయాలన్నారు. కీర్తన గోల్డ్ లోన్ సంస్థలో గోల్డ్‌లోన్లలో జరిగిన గోల్‌మాల్‌పై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారులు, సిబ్బందితో పాటు ఖాతాదారులను పిలిపించి పోలీసులు విచారణ చేశారు. అనంతరం స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణతో కలసి సీఐ విలేకరులతో మాట్లాడారు. కీర్తన గోల్డ్‌లోన్ల సంస్థలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకోగా, కొందరు సిబ్బంది ఖాతాదారులకు తెలియకుండా అదనంగా రుణం తీసుకొని డబ్బులు కాజేరన్నారు. ఆలస్యంగా గుర్తించిన ఖాతాదారులు సంస్థ అధికారులను, సిబ్బందిని అడిగితే వారు సరిగా స్పందించకపోవటంతో స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారన్నారు. గోల్డ్‌లోన్లలో సుమారు రూ.90 లక్షల వరకు సిబ్బంది గోల్‌మాల్ చేశారని గుర్తించామన్నారు. ఇందుకు బాధ్యులైన సంస్థ ప్రతినిధి అనుదీప్, సిబ్బంది నుంచి సంబంధిత సంస్థ అధికారులే డబ్బులు రికవరీ చేసి ఖాతాదారులు ఇవ్వాలని ఆదేశించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.
కీర్తన గోల్డ్‌లోన్ సంస్థ అధికారులకు తేల్చిచెప్పిన పోలీసులు
నిందితుల నుంచి బంగారం రికవరీ చేసి ఖాతాదారులకు ఇవ్వాలని ఆదేశం


