పుట్టపర్తి అర్బన్: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో అధికార యంత్రాంగం అంకెల గారడీ చేస్తోంది. ఈ నెల 18వ తేదీ నాటికే జిల్లాలో 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ పూర్తయ్యిందని ఘనంగా ప్రకటించింది. అంటే ఆ రోజుకు ఉన్న ఓటర్ల లెక్కలే ఫైనల్ కావాలి. కానీ తాజాగా శనివారం విడుదల చేసిన ఓటరు జాబితాలోని లెక్కలు చూస్తే భారీ తేడాలున్నాయి. దీంతో ఈనెల 31న విడుదల చేస్తున్న ముసాయిదా ఓటరు జాబితాపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
పెరిగిన మృతుల సంఖ్య..
ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన జాబితాలో డెత్ ఓటర్లు 53,791 మంది ఉండగా... శనివారం విడుదల చేసిన జాబితాలో 55,068 ఉన్నట్లు చూపారు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత కొత్తగా 1,277 మంది మృతులు ఎక్కడి నుంచి వచ్చారని జనం చర్చించుకుంటున్నారు.
ఇతరులూ పెరిగి...తరిగారు..
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఇతర ఓటర్ల సంఖ్య 72 మాత్రమే ఉండేది. కానీ ఈ నెల 18వ తేదీ నాటికి ఇతర ఓటర్ల సంఖ్య 305కి చేరింది. అయితే శనివారం నాటికి వారి సంఖ్య 152 మాత్రమే ఉంది.
ఇంటివద్ద లేని ఓటర్ల సంఖ్యలోనూ తేడాలు..
జిల్లాలో ‘సర్’ కార్యక్రమానికి ముందు జిల్లాలో మొత్తం 14,23,839 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈనెల 18వ తేదీన విడుదల చేసిన జాబితాలో ఇంటి వద్ద లేని ఓటర్లు 33,476 మంది ఉన్నట్లు గుర్తించారు. శనివారం విడుదల చేసిన జాబితాలో 30,686 మంది ఉన్నట్లు చూపారు. అయితే ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత కొత్తగా 2,790 మంది తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈనెల 18 నాటికి పత్తా లేని ఓటర్లు (శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఆల్ రెడీ ఎన్‌రోల్ చేయించుకున్న వారు, ఇంటి వద్ద లేని ఓటర్లనంతా కలిపి) 1,15,364 మందిని చూపారు. శనివారం నాటికి వారి సంఖ్య 1,09,108 మందికి తగ్గించారు. ఇలా అధికారుల విడుదల చేస్తున్న అంకెల్లో భారీ మార్పులు ఉండడంతో ముసాయిదా జాబితా నాటికి జాబితాలో ఎంత మందిని ఓటర్లుగా తేలుస్తారో...ఎంత మందిని తగ్గిస్తారోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
31న ముసాయిదా జాబితా..
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ పూర్తి కావడంతో ఈనెల 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. అనంతరం నెల రోజులు గడువు విధించి ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి వాటికి పరిష్కారం చూపనున్నారు. అభ్యంతరాలు తీసుకునేందుకు జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకూ గడువు విధించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు పరిష్కరించడానికి అభ్యంతరాలు స్వీకరించిన నాటి నుంచి సెప్టెంబర్ 28 వరకూ గడువు ఉంది. తుది ఓటరు జాబితా అక్టోబర్ 3వ తేదీన ప్రచురించనున్నారు.
జిల్లా ఓటర్లు ఇలా..
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,23,839 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మడకశిర నియోజక వర్గంలో 2,13,309 మంది, హిందూపురం నియోజక వర్గంలో 2,53,239 మంది, పెనుకొండ నియోజక వర్గంలో 2,38,566 మంది, పుట్టపర్తి నియోజక వర్గంలో 2,13,345 మంది, ధర్మవరంలో 2,48,185 మంది, కదిరి నియోజక వర్గంలో 2,57,195 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాలో ఎంత మంది ఓట్లు గల్లంతవుతాయోనన్న భయం అందరినీ వెంటాడుతోంది.
ఓటు లెక్కలు.. అన్నీ తప్పులు!
రోజురోజుకూ పెరిగిన మృతుల సంఖ్య
వారం రోజుల్లో పెరిగిన మృతులు 1,277 మంది
ఇంటివద్దలేని ఓటర్లలోనూ
2,790 మంది తగ్గింపు
అధికారుల పొంతన లేని లెక్కలపై జనం పెదవి విరుపు
ముసాయిదా ఓటరు జాబితాపై
సర్వత్రా ఆందోళన
సర్ సర్వే తర్వాత అందుబాటులో లేని వారి జాబితా ఇలా...


