● చంద్రబాబు ప్రభుత్వం వెంటనే
అర్హులకు న్యాయం చేయాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్
పెనుకొండ రూరల్: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత, విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. విద్యార్థుల డిమాండ్ మేరకు నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారన్నారు. రాష్ట్రంలో కూడా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలిచ్చి వేలాది మంది భవిష్యత్‌ను అంధకారం చేసిందన్నారు. ఇప్పటికే పలువురు అర్హుల వయస్సు దాటిపోయిందని, వారు మరో డీఎస్పీ రాసే అవకాశం కూడా లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన తప్పు సరిదిద్దుకుని అర్హులకు న్యాయం చేయాలని, లేకపోతే జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలు రాష్ట్రంలోనూ జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ధర్మేంద్ర రాజీనామా మోదీ ప్రభుత్వ పతనానికి నాంది
● మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి
మడకశిర: మోదీ ప్రభుత్వ పతనానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నాంది అని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శనివారం ఆయన తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో విలేకర్లతో మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. జంతర్ మంతర్ వద్ద సాగిన ఉద్యమం విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చిందన్నారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరు ఎంతో అమోఘమని కొనియాడారు. నీట్ పేపర్ లీక్‌తో పాటు ఇతర పేపర్ లీకులు, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. ఇందులో బీజేపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
పాము కాటుతో వీఆర్‌ఏ మృతి
తలుపుల: మండలంలోని పులిగుండ్లపల్లి వీఆర్‌ఏ దేవదాసు (46) పాముకాటుకు గురై శనివారం మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన మేరకు.. దేవదాసు శనివారం విధులు ముగించుకొని నేరుగా తన పొలం వద్దకు వెళ్లారు. పనులు చేస్తున్న క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. వెంటనే ఇంటికి వచ్చి తలుపులలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి
వెళ్లాడు. అక్కడ చికిత్స పొందేలోపు మృతి చెందాడు. మృతుడికి భార్య సలేమా సునీత, ఇద్దరు కుమారులు ఉన్నారు.


