పుట్టపర్తి అర్బన్: జిల్లాలో పచ్చదనం మరింతగా పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఆయన పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లిలో అధికారులు, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్, తహసీల్దార్ సంహిత, ఏపీడీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకోండి
ప్రశాంతి నిలయం: యువతలో వృత్తి నైపుణ్యాలను వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న ‘ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్–2026’కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన యువత tinyurl.com లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా అధికారి హరికృష్ణతో కలిసి ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్ పోస్టర్లు ఆవిష్కరించారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారన్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఇతర సంప్రదాయ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు.
పర్యావరణ పరిరక్షణకు
ప్రతి ఒక్కరూ పాటుపడాలి
హిందూపురం టౌన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. పట్టణంలోని డీబీ కాలనీలోని మినీ మార్కెట్ ఆవరణలో సుజాత నిర్వహణలో ఏర్పాటు చేసిన ‘మల్టీ–ప్రొడక్ట్ స్టోర్ హంస’ ఎకో షాప్‌ను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు మానవ ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. ‘ప్లాస్టిక్ నిషేధిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం‘ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు, స్వయం ఉపాధి ద్వారా పర్యావరణ అనుకూల వ్యాపారానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి ఎకో షాపుల ద్వారా ప్రత్యామ్నాయ ఉత్పత్తులను ప్రజలకు తక్కువ ధరలోనే అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మెప్మా పీడీ నాగరాజు, తహసీల్దార్ వెంకటేశు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు దుర్మరణం
కనగానపల్లి: కనగానపల్లి సమీపంలో శనివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం అక్కంపల్లికి చెందిన శ్రీనివాసులు (39) ద్విచక్ర వాహనంపై తగరకుంట వైపు నుంచి కనగానపల్లికి వెళ్తున్నాడు. అదే సమయంలో యలకుంట్ల గ్రామానికి చెందిన బాలరాజు (26) మరో ద్విచక్ర వాహనంపై కనగానపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. తీరా కనగానపల్లి వద్ద పండమేరు బ్రిడ్జి దాటిన తర్వాతా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరూ కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శ్రీనివాసులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, బాలరాజును స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. ప్రమాద ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
గోరంట్ల: ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 240 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. శనివారం మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. అనంతపురానికి చెందిన సతీష్‌ను అరెస్టు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని, ఐచర్‌ను సీజ్ చేశారు. దాడుల్లో డీటీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


