కదిరి టౌన్: హిందువులు విశిష్టమైన పర్వదినంగా భావించే తొలి ఏకాదశి సందర్భంగా శనివారం వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే ఆలయాల ఎదుట బారులు తీరిన భక్తులు... ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనంతో పులకించిపోయారు. ఆయా ఆలయ కమిటీల సభ్యులు భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ చేశారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తొలి పండుగ రోజు జిల్లా ఆధ్యాత్మికశోభతో కాంతులీనింది.
నమో నారసింహ
కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ‘ఓం నమో నారసింహ’ నామస్మరణతో ప్రతిధ్వనించింది. శనివారం, తొలిఏకాదశి కలిసి రావడంతో కదిరి పరిసరాల ప్రాంతాల నుంచే కాకుండా చిత్తూరు, వైస్సార్ కడప, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఖాద్రీశున్ని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
వైభవంగా తొలిఏకాదశి... ఆలయాలకు పోటెత్తిన భక్తులు


