పుట్టపర్తి టౌన్: ‘‘నేరస్తులకు పోలీసులంటే భయం ఉండాలి. నేర నియంత్రణలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రజల భద్రతే మన తొలి బాధ్యత కావాలి’’ అని ఎస్పీ సతీష్‌కుమార్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. శనివారం స్థానిక సాయి ఆరామంలో ఎస్పీ సతీష్‌కుమార్ అధ్యక్షతన పోలీసుశాఖ అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, చోరీలు, గ్రేవ్, నాన్‌గ్రేవ్, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, పెండింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. అనంతరం పెనుకొండ జాతీయ రహదారిపై జరిగిన దోపిడీ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన పోలీసులకు, గ్యాంగ్ రేప్ కేసులో కీలకంగా పనిచేసిన పోలీస్ అధికారులతో పాటు వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ... పెండింగ్ ఉన్న వివిధ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. చోరీల నియంత్రణలో మరింత కఠినంగా వ్యవహరించడంతో పాటు ప్రాపర్టీ కేసుల రికవరీ పెంచాలన్నారు. సమాజానికి హానికరంగా మారే పాత నేరస్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని, అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేసేందుకు వెనకాడవద్దని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నేరాలు, ప్రాపర్టీ నేరాలు, చోరీలు, గొడవలు, రోడ్డు ప్రమాదాల కేసుల్లో దర్యాప్తులో వేగవంతం చేయాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేయాలన్నారు. పాత నేరస్తులు, నూతన వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. సీసీ కెమెరాలపై అవగాహన కల్పించి దేవాలయాల్లో, వీధుల్లో, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ శ్రీరామ్‌నాయక్ మాట్లాడుతూ... భారతీయ నాగరిక సురక్ష సంహితతోపాటు కొత్తగా వచ్చిన చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలన్నారు. సాక్ష్యాలు శాసీ్త్రయంగా సేకరించి కోర్టులో దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, డీఎస్పీలు కేవీ మహేష్, శివన్నారాయణస్వామి, పోలీసు న్యాయ సలహాదారు సాయినాథ్‌రెడ్డి, ఏఓ వేణుగోపాల్, పబ్లిక్ ప్రాసెక్యూటర్లు దర్గాదేవి, శ్రీనివాసులు, నాగేష్, భాను, సుచిత్ర, ఆదినారాయణమ్మ, ప్రత్యూష,తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల భద్రతే పోలీసుల తొలి బాధ్యత
నేర సమీక్షలో ఎస్పీ సతీష్‌కుమార్


