మడకశిర: స్థానిక కెనరా బ్యాంకులోని గోల్డ్ అప్రైజర్ సుందరాచారి అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం వేశాడు. నకిలీ బంగారంతో బ్యాంకును మోసం చేసి వివిధ ఖాతాల ద్వారా రూ.71 లక్షలు స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కెనరా బ్యాంకులో సుందరాచారి గోల్డ్ అప్రైజర్‌గా పని చేస్తున్నాడు. నకిలీ బంగారంతో ఏడుగురికి రూ.71 లక్షలు బంగారు రుణాలు మంజూరు చేయించాడు. అనంతరం 12 ఖాతాల నుంచి రూ.71 లక్షలు డ్రా చేసుకుని అందరూ కలిసి పంచుకున్నారు. శనివారం బ్యాంకుకు వచ్చిన ఆడిట్ అధికారులు బంగారు రుణాలకు సంబంధించిన ఆభరణాలు తనిఖీ చేయగా...నకిలీ బంగారం బయటపడింది. దీంతో గోల్డ్ అప్రైజర్ సుందరాచారి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బ్యాంకు అధికారులు గోల్డ్ లోన్లకు సంబంధించిన ఆభరణాలన్నీ పరిశీలించి ఏడుగురు తనఖా పెట్టిన ఆభరణాలు మాత్రం నకిలీవని తేల్చారు. వెంటనే బ్యాంకు మేనేజర్ గోల్డ్ అప్రైజర్ సుందరాచారితో పాటు నకిలీ బంగారం తాకట్టుపెట్టిన ఏడుగురు ఖాతాదారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సీఐ రాజ్‌కుమార్ అందుబాటులో లేకపోవడంతో ఈ ఘరానా మోసంపై ఇంకా కేసు నమోదు చేయలేదని సమాచారం.
నకిలీ బంగారంతో రూ.71 లక్షల మోసం


